
పోలీసు జాగిలానికి నివాళి
తిరువొత్తియూరు: చైన్నె, విమానాశ్రయంలో మృతి చెందిన 13 ఏళ్ల ఆడ జాగిలానికి పోలీసు లాంఛనంతో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు.. రాణి అనే కుక్కపిల్ల పంజాబ్ రాష్ట్రంలో 2012 ఫిబ్రవరి 18న జన్మించింది. ఇది స్నిఫర్ డాగ్ యూనిట్‌లో చేరింది . పంజాబ్ రాష్ట్రంలోని అటారీలో ప్రత్యేక శిక్షణ పొందింది. బాంబులు, పేలుడు పదార్థాలను గుర్తించగల సామర్థ్యం ఉన్న స్నిఫర్ డాగ్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత, 2013 ఫిబ్రవరి 13న చైన్నె విమానాశ్రయంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్నిఫర్ డాగ్ యూనిట్‌లో విధుల్లో చేరింది. దాదాపు 10 సంవత్సరాలు అద్భుతంగా సేవలు అందించిన స్నిఫర్ డాగ్ రాణి 2022 ఆగస్టు 4న విధుల నుంచి పదవీ విరమణ చేసింది. ఆ తర్వాత విమానాశ్రయంలో జంతువుల సంరక్షణ కేంద్రంలో దీనిని పోషించారు. ప్రస్తుతం 13 ఏళ్ల స్నిఫర్ డాగ్ రాణి వద్ధాప్య కారణాలతో ఈనెల 26న మరణించింది. ఆ తర్వాత స్నిఫర్ డాగ్ రాణి మతదేహాన్ని మీనంబాక్కంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడ, మరణించిన భద్రతా సిబ్బందికి ఎలాంటి గౌరవం ఇస్తారో, అదే గౌరవాన్ని రాణికి కూడా ఇచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నతాధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.