
విక్రమ్‌తో ఎందుకు ఆగిందంటే?
తమిళసినిమా: నటుడు విక్రమ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయనకు కథ నచ్చిందంటే అందులో నటించడానికి ఎంతవరకై నా వెళతారు. అయితే కథ ఆయనకు నచ్చాలి అంతే. వీరధీరసూరన్ చిత్రం తర్వాత విక్రమ్ ఇప్పటివరకు మరో చిత్రంలో నటించలేదు. అయితే పలు కథలు వింటున్నారు. అలా 96, మెయ్యళగన్ చిత్రాల దర్శకుడు ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అది కూడా సెట్ పైకి వెళ్లలేదు. అందుకు కారణాలను దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెలుపుతూ తాను విక్రమ్ హీరోగా చిత్రం చేయాలని భావించినప్పుడు కథ రెడీ కాలేదు అన్నారు. అయితే తన వద్ద ఉన్న రెండు కథలు సింగిల్ లైన్‌లను ఆయనకు వినిపించానన్నారు. అందులో ఒక కథ నచ్చడంతో చేద్దామని చెప్పారన్నారు. దీంతో తాను పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి విక్రమ్ కు చెప్పగా ఆయన ఈ స్క్రిప్టు కాదు మీరు చెప్పిన ప్రేమకథా చిత్రం చేద్దామని అన్నారన్నారు. అయితే ఓ చిత్రానికి కథను సిద్ధం చేసిన తర్వాత మరో కథను రెడీ చేయడానికి చాలా సమయం పడుతుందన్నారు. దీంతో విక్రం హీరోగా చేయాల్సిన కథ అలా నిలిచిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన మలయాళ స్టార్ నటుడు ఫాహత్ ఫాజిల్ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఫాహత్ ఫాజిల్‌కు మలయాళంతో పాటు తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. ఈయన ఇటీవల వడివేలుతో కలిసి నటించిన మారిశన్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో ఫాహత్ ఫాజిల్ నటించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.