
ధాన్యం దళారుల పాలు
● పల్లెల్లోకి ప్రైవేట్ వ్యాపారులు ● ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు ● మద్దతు ధర కోల్పోతున్న రైతులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో ఇప్పటికే చేతికొచ్చిన ధాన్యాన్ని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిస్తే రంగుమారుతుందనే భయంతో అన్నదాతలు సైతం వ్యాపారులు ఎంత ధర చెబితే అంతకే అమ్మేస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 25వేల ఎకరాల వరకు వరి సాగుచేశారు. మొదట సాగుచేసిన వరి పంటలు కోతకొచ్చాయి. పెద్దలింగాపూర్ ప్రాంతంలో చాలా మటుకు పంట కోతకొచ్చింది. గత వారం రోజులుగా పంటను కోస్తున్న రైతులు వర్షం కురుస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు. ఒక్క పెద్దలింగాపూర్ గ్రామంలోనే ప్రైవేట్ వ్యాపారులు ఇప్పటి వరకు ఐదు లారీల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిసింది. పచ్చి వడ్లను క్వింటాల్‌కు రూ.1700 దళారులు కొనుగోలు చేస్తున్నారు. బస్తాకు రెండు కిలోల తరుగు తీస్తున్నారని రైతులు తెలిపారు. గత రబీ సీజన్‌లో ఇల్లంతకుంట మండలంలో 28 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు. దీంతో చేసేదేమి లేక రైతులు ప్రైవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు.