కంటి నిండా నిద్ర | - | Sakshi
Sakshi News home page

కంటి నిండా నిద్ర

Oct 5 2025 2:22 AM | Updated on Oct 5 2025 2:22 AM

కంటి

కంటి నిండా నిద్ర

● సిరిసిల్లలో నిలిచిన రాత్‌ఫైల్‌ ● నిద్రిస్తున్న కార్మిక క్షేత్రం ● మార్పుతో ఆరోగ్యం.. ప్రశాంతత ● పెరిగిన ఉత్పత్తి

చేతి నిండా పని..

మరమగ్గాలు నడుపుతున్న ఇతను కోడం బాలకిషన్‌. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లోని ఓ కార్ఖానాలో పాలిస్టర్‌ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.8వేల నుంచి రూ.10 వేల సంపాదిస్తున్నాడు. నిత్యం 12 సాంచాల మధ్య 10 గంటలపాటు పని చేస్తున్నాడు. గతంలో రాత్రిపూట పని చేసేవాడు. కానీ ఇప్పుడు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నాడు. వచ్చే కూలీలో నెలకు రూ.1200 చొప్పున త్రిఫ్ట్‌ పొదుపు పథకంలో చెల్లిస్తున్నాడు. రాత్రి డ్యూటీకి రాం రాం చెప్పి పొద్దంతా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలా ఒక్కరు.. ఇద్దరు కాదు సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో పలువురు నేతకార్మికులు రాత్‌పైల్‌ (నైట్‌ డ్యూటీ) రాం రాం చెబుతూ దిన్‌పైల్‌ (పొద్దంతా) పని చేస్తున్నారు.

సిరిసిల్ల: వస్త్రోత్పత్తి ఖిల్లా.. సిరిసిల్లలో చిన్న మార్పు పెద్ద ఫలితాన్నిస్తోంది. రాత్‌పైల్‌(రాత్రి డ్యూటీ) రద్దు చేయడంతో కార్మికుల ఆరోగ్యంగా ఉండడంతోపాటు వస్త్రోత్పత్తి సైతం పెరిగింది. కార్మిక కుటుంబాలు సైతం సంతోషంగా ఉంటున్నాయి. ఇన్నాళ్లు సిరిసిల్లలో ఒక్క వారం రాత్రి, మరో వారం పగటి డ్యూటీలు ఉండేవి. రాత్రి డ్యూటీ చేసిన రోజుల్లో నేతకార్మికులు నిద్రలేమితో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే వారు. నిద్ర రాకుండా మధ్య..మధ్యలో టీ తాగి వచ్చేవారు. వీరి కోసం పట్టణంలో ప్రత్యేక టీకొట్టులు సైతం ఉండేవి. ఇటీవల రాత్రి డ్యూటీలు రద్దు చేయడంతో పొద్దంతా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్లు, పొరుగు రాష్ట్రాల వస్త్రోత్పత్తి ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతినిండా పని ఉంటుంది.

పని గంటలు తగ్గిస్తే..

సిరిసిల్లలో కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. దీంతో పని గంటల సమస్యలు ఎదురవుతున్నాయి. పొద్దంతా పనిచేసినా 8 గంటల పని విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. కార్మికులు డ్యూటీలోకి వచ్చిన తరువాత 8 గంటల పనిచేసి డ్యూటీ దిగేలా చేనేత, జౌళిశాఖ, కార్మికశాఖ అధికారులు ప్రణాళికను అమలు చేయాలి. మరో వైపు ఒక్కో కార్మికుడు 10 నుంచి 12 సాంచాలపై పాలిస్టర్‌ వస్త్రోత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు అయితే 6 నుంచి 8 సాంచాలు నడిపిస్తున్నారు. ఇలా ఎక్కువ సాంచాలు నడపడం మూలంగా పని ఒత్తిడి పెరిగి అలసిపోతున్నారు. ఏదైనా సాంచాలు రిపేరు వస్తే ప్రత్యేక మెకానిక్‌లు(జాపర్లు) లేక కార్మికులే చేస్తున్నారు. కాలం చెల్లిన సాంచాలు తరచూ రిపేర్లతో వస్త్రోత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఎంత వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తే.. అంత మేరకు కూలీ రావడంతో కార్మికులు ఎక్కువ సాంచాలు నడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టుల్లో 8 గంటల చొప్పున పనివిభజన జరగాల్సిన అవసరం ఉంది. ఆ 8 గంటల్లోనే నేతన్నలకు మెరుగైన కూలీ లభించే పని విధానం ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాంచాల మధ్య నవ్వుతున్న ఇతను దూస దేవరాజు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌లో పవర్‌లూమ్‌ కార్మికుడు. ఉదయం 7 గంటలకు కార్ఖానాకు వచ్చి ఇలా సాంచాలు నడిపేందుకు సిద్ధమయ్యాడు. రాత్రంతా ఇంట్లోనే హాయిగా నిద్రపోవడంతో పనిచేసేందుకు ఉత్సాహంగా వచ్చాడు. గతంలో రాత్రి డ్యూటీ చేసి అలసిపోయి, నిద్రలేమితో బాధపడేవారు. కానీ ఇప్పుడు పొద్దంతా పనిచేస్తున్నాడు. నిత్యం ఆరు సాంచాలపై వస్త్రోత్పత్తి చేస్తూ.. నెలకు రూ.12 వేల నుంచి రూ.16వేల వరకు సంపాదిస్తున్నాడు.

కంటి నిండా నిద్ర1
1/2

కంటి నిండా నిద్ర

కంటి నిండా నిద్ర2
2/2

కంటి నిండా నిద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement