
ఏఎన్‌యూ వీసీగా సత్యనారాయణ రాజు
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఆచార్య సామంతపూడి వెంకట సత్యనారాయణరాజు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ నజీర్ అహ్మద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య సత్యనారాయణరాజు ఇప్పటి వరకూ వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటోమాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఏఎన్‌యూలో గత కొంతకాలంగా ఇన్‌చార్జి వీసీగా ఆచార్య కె. గంగాధరరావు విధులు నిర్వహిస్తున్నారు. సత్యనారాయణరాజు అగ్రికల్చర్ బీఎస్సీని మహారాష్ట్రలోని డాక్టర్ పుంజాబ్‌రావు క్రిషి విద్యాపీఠ్ నుంచి 1983లో ఉత్తీర్ణులయ్యారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సును హిమాచల్‌ప్రదేశ్‌లోని డాక్టర్ వైఎస్ పర్మార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టికల్చర్ అండ్ పారెస్ట్రీ నుంచి 1986 లోనూ, అగ్రికల్చర్ ఎంటోమాలజీలో పీహెచ్‌డిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 1990లో పొందారు. బోధన రంగంలో 28, పరిశోధనా రంగంలో 32 సంవత్సరాల అనుభవం గడించారు. రైతులు అనుబంధ అంశాల్లో 28 సంవత్సరాలకు పైగా పాలు పంచుకున్నారు.