
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి
జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్
గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించాలని జిల్లా పంచాయతీ అధికారి బీవీఎం సాయికుమార్ పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ‘ధీమ్–5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’పై రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో సాయికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు, అధ్వాన వాతావరణం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చునని తెలిపారు. జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చునని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో డీపీఆర్సీ రీసోర్స్ పర్సన్ రామకృష్ణ, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు.