
కొందరు తల్లిదండ్రులు చండశాసనులు
మరికొందరు ‘బొమ్మరిల్లు’ ప్రకాష్‌రాజ్‌లు
‘డాల్ఫిన్ పేరెంటింగ్’కే సైకాలజిస్టుల ఓటు
తమ పిల్లలకు కష్టం తెలియకూడదని పెంచే తల్లిదండ్రులు కొందరు...తమ పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని కఠినంగా ఉండే పేరెంట్స్ ఇంకొందరు..ఏదైనా మాట అంటే వెంటనే భయపడిపోతారని కోప్పడటానికే భయపడిపోయే తల్లిదండ్రులు ఇంకొందరు.తమ మాటే శాసనంగా పిల్లలు భావించాలనుకునేవారు.. పిల్లల విషయాల్లో అతిగా జోక్యం చేసుకునేవాళ్లు..పిల్లలు చదువులో రాణించాలని వారిపై తమ ఇష్టాయిష్టాలు రుద్దేవారు..ఇలా రకరకాల పేరెంట్స్. ఎవరు చేసేది వారికి కరెక్టుగానే అనిపిస్తుంది. మరి, వీరిలో ఎవరు బెస్ట్ పేరెంట్? ఏది బెస్ట్ పేరెంటింగ్?
ఈ రోజుల్లో పేరెంటింగ్.. అత్యంత కష్టమైన పని. కృత్రిమ మేధనైనా సృష్టించవచ్చు, నియంత్రించవచ్చుగానీ పిల్లల పెంపకం మాత్రం సులభంగా చేయలేం.– ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెబుతున్న మాటలివి.
నిజమే. ఒకప్పటిలా ఇప్పటి రోజులు లేవు. ఇన్ని ప్రభావాలూ లేవు.తల్లిదండ్రుల ఆలోచనా విధానం కూడా ఒకప్పటిలా లేదు. రకరకాల తల్లిదండ్రులు మనకు సమాజంలో కనిపిస్తున్నారు. మూడు ప్రధానమైన పేరెంటింగ్ విధానాల్లో ‘డాల్ఫిన్ పేరెంటింగ్’ మంచిదని సైకాలజిస్టులు చెబుతున్నారు.
హెలికాప్టర్ పేరెంటింగ్..: చెప్పాలంటే బొమ్మరిల్లులోని ప్రకాష్ రాజ్ లాంటి తండ్రి లేదా తల్లి. తమ పిల్లలు కాలు కింద పెట్టకుండా.. ఎండ కన్నెరుగకుండా.. వారికి ఏమాత్రం కష్టం కలగకుండా చూసుకునేవారు. వారి గురించి అతిగా ఆలోచిస్తూ.. నిరంతరం వారిని పర్యవేక్షిస్తూ.. వారికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకునేవాళ్లు. ఈ విషయాన్ని తమ బంధుమిత్రులకు గొప్పగా చెప్పుకోడానికి కూడా ఇష్టపడతారు.
పిల్లలపై ప్రభావం..: ఇలాంటి పేరెంట్స్ ఉన్న పిల్లలు స్వతంత్రంగా ఆలోచించలేరు, నిర్ణయాలు తీసుకోలేరు, సమస్యలను పరిష్కరించలేరు, భావోద్వేగాల నియంత్రణ ఉండదు. ఇది పిల్లలను స్వతంత్రంగా ఎదగనివ్వదు. ఇలాంటి తల్లిదండ్రులంటే పిల్లలకు భయం ఉండదు కానీ.. వారిని తప్పించుకు తిరగాలన్న మనస్తత్వం ఉంటుంది.
టైగర్ పేరెంటింగ్
వీళ్లు చండశాసనులు. చాలా స్ట్రిక్టుగా ఉంటారు. తమ పిల్లలు చదువులోనూ, సంగీతం వంటి ఇతర అంశాల్లోనూ కచ్చితంగా రాణించాలని, పేరు ప్రతిష్ఠలు (తమకూ వస్తాయన్న స్వార్థం కూడా అంతర్లీనంగా ఉంటుంది) సంపాదించాలని వారిపై ఒత్తిడి తెస్తుంటారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, లక్ష్యాల పేరిట పిల్లలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పిల్లలను ఆధిపత్య ధోరణితో పెంచుతారు. వారిలో తమ పట్ల భయం ఉందన్న విషయాన్ని తమ చుట్టుపక్కల వారికి తెలియాలని అనుకుంటారు.
పిల్లలపై ప్రభావం
ఇలాంటి పేరెంట్స్ అంటే పిల్లలు భయపడతారు.. వీలైనంతవరకు తప్పించుకు తిరగాలని చూస్తారు. పిల్లలపై నిత్యం ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ విఫలమవుతామోనన్న భయం వెంటాడుతుంటుంది. తమ తల్లిదండ్రులు ఉన్నంత వరకు క్రమశిక్షణతో ఉన్నట్టు కనపడే ఈ పిల్లలు.. వాళ్లు లేరని లేదా తమ గమనించడం లేదని తెలిస్తే మాత్రం కట్టుబాట్లన్నీ పక్కనపెట్టేస్తారు.
డాల్ఫిన్ పేరెంటింగ్
వీళ్లు పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారు. పిల్లలతో మరీ కఠినంగానూ ఉండరు, అలాగని పూర్తిగా వదిలేయరు. అన్ని విషయాల్లోనూ సమతూకం పాటిస్తారు. అతిగా షరతులు పెట్టరు. అలాగని క్రమశిక్షణకూ విలువిస్తారు. పిల్లలను స్వతంత్రంగా ఆలోచించనిస్తారు. వారికి మరీ కష్టంగా ఉన్నప్పుడు లేదా ఇక వారికి సాధ్యం కాదు అనుకున్నప్పుడు చేయూతనిస్తారు. వారితో ఆత్మవిశ్వాసం నింపుతారు.
దీన్ని స్మార్ట్ గ్యాడ్జెట్లు, సోషల్ మీడియా మాటల్లో చెప్పాలంటే.. కొన్ని విషయాల్లో స్పష్టమైన నిబంధనలు పెడతారు. ఉదాహరణకు.. రాత్రిపూట పడుకునేముందు ఫోన్లు ఉండకూడదు. ఒక వయసు వచ్చే వరకూ సోషల్ మీడియాను ఎంకరేజ్ చేయరు. ప్రతిరోజూ స్క్రీన్ టైమ్ విషయంలో కచ్చితంగా ఉంటారు.
అయితే ఈ విషయాలను ఆధిపత్య ధోరణితో కాకుండా.. వారికి అర్థమయ్యేలా చెప్తారు. హార్వర్డ్‌లో శిక్షణ పొందిన కెనడాకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ షిమి కాంగ్ దీనిపై ‘ద డాల్ఫిన్ పేరెంట్ ః ఎ గైడ్ టు రెయిజింగ్ హెల్తీ, హ్యాపీ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ కిడ్స్’ పుస్తకం కూడా రచించారు.
పిల్లలపై ప్రభావం
పిల్లలకు తమ హద్దులేంటో తెలుస్తాయి. అందువల్ల అలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కఠినంగా ఉన్నా దాన్ని శిక్షలా కాకుండా.. తమ మంచి కోసమే అని అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఉంటారు. వాళ్లంటే భయపడకుండా.. వారితో ప్రతి విషయాన్నీ షేర్ చేసుకుంటారు.