
ఉల్లి.. రైతు తల్లడిల్లి!
కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు తల్లడిల్లుతున్నారు. ఉల్లి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పండించిన ఉల్లిని మార్కెట్‌కు తీసుకెళ్తే పెట్టుబడి ఖర్చులు దేవుడెరుగు కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ప్రభుత్వం మొదట ఉల్లి క్వింటాలుకు రూ.1200 ధర కల్పిస్తామని చెప్పడం తర్వాత ఎకరానికి రూ.20 వేలు ఇస్తామంటూ రోజుకో మాట చెబుతుండటంతో నమ్మకం లేక రైతన్నలు తీవ్ర ఆవేదనతో చేతికొచ్చిన పంటను దున్నేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పరి మండలం జొహరాపురం గ్రామానికి చెందిన జేపీ రంగస్వామి అనే రైతు ఆరెకరాల్లో ఉల్లి పంటను ట్రాక్టర్‌తో మంగళవారం తొలగించాడు. పంట సాగు కోసం రూ.3 లక్షల పెట్టుబడి పెట్టాడు. మార్కెట్లో ఉల్లికి ధర లేకపోవడం, కోతలకు అయ్యే ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉండటంతో తీవ్ర ఆవేదనకు గురై చేతికొచ్చిన పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. అంతకుముందు పంటను గొర్రెలకు వదిలేశాడు. ఇదిలాఉండగా జొహరాపురంలో 15 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో నల్లరేగడి మెట్ట పొలంలో ఉల్లిని సాగు చేశారు. వారు కూడా చేసేది లేక ఉల్లి పంటను తొలగించారు.
– ఆస్పరి
జొహరాపురంలో ఉల్లి పంటను ట్రాక్టర్‌తో
తొలగిస్తున్న రైతన్న