
బాధ దిగమింగి.. జీవాలకు మేతగా..
ఉల్లిని కూలీలతో తెంపి మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తే సొమ్ము చేతికి రావాల్సింది పోయి.. మరింత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన దుస్థితి. దీంతో దిక్కుతోచక రైతులను పంటను జీవాలకు మేతగా వదిలేస్తున్నారు.
ఆలూరు మండలం మనేకుర్తికి చెందిన చాకలి పరమేష్ బోరు బావి కింద రెండెకరాల్లో ఉల్లి సాగు చేశారు. పెట్టుబడుల కోసం రూ.2 లక్షలు అప్పు చేశారు. పంట చేతికొచ్చిన దశలో ఉల్లికి ధర లేకుండా పోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. మార్కెట్‌లో ఉల్లి ధర.. పంట కోతకు కూలీల ఖర్చు, రవాణా ఖర్చును భేరీజు వేసుకోగా మరింతగా అప్పుల భారం మీద పడుతుందని లెక్కలు వేసుకున్నారు. బాధను దిగమింగుకుని మంగళవారం ఉల్లి పంటను జీవాలకు మేతగా వదిలేశారు. దీనిపై బాధిత రైతును పలకరించగా.. ప్రభుత్వం ఉల్లి పంట హెక్టారుకు రూ.50 వేలు సాయం ప్రకటించింది. అది వచ్చే వరకు పొలంలో పంటను అలాగే ఉంచుకోలేం. అంతకుముందు ఉల్లి క్వింటాలుకు ప్రకటించిన రూ.1,200 మద్దతు ధర కూలీలకు కూడా సరిపోదు. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం శ్రమించి పంటలను సాగు చేసిన రైతులకు చివరకు ఆత్మహత్యలే శరణ్యం తప్పా.. మిగిలేది ఏమీ లేదని కన్నీటి పర్యంతమయ్యారు. – ఆలూరు
జీవాలకు మేతగా వదిలేసిన ఉల్లి పంట
ఉల్లిగడ్డలను
చూపుతున్న రైతు వీరేష్

బాధ దిగమింగి.. జీవాలకు మేతగా..