
కల్వర్టు వద్ద ఇరుక్కుపోయిన లారీ
● స్తంభించిన రాకపోకలు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్‌అండ్‌బీ రహదారిలో మంగళవారం అర్ధరాత్రి కల్వర్టు వద్ద ఫ్లయాష్ లారీ ఇరుక్కుపోయింది. నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని గుళ్లదూర్తి సమీపంలో కల్వర్టు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డును పక్కకు మళ్లించారు. అరకొరగా గ్రావెల్ వేసి తాత్కాలికంగా రోడ్డును ఏర్పాటు చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతింది. ఈ స్థితిలో మంగళవారం జమ్మలమడుగు నుంచి కోవెలకుంట్లకు వస్తున్న ఫ్లయాష్ ట్యాంకర్ లారీ గ్రావెల్ రోడ్డులో ఇరుక్కుపోయింది. ఈ రహదారిలో ప్రత్యామ్నా యం లేకపోవడంతో రెండు వైపులా వాహనాలు నిలిచి రాకపోకలు స్తంభించాయి. దీంతో కర్నూలు, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, తిరుపతి, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని వాహనాలను గుళ్లదూర్తి నుంచి సంజామల మీదుగా కోవెలకుంట్ల వైపు మళ్లించారు. ఉదయం 10 గంటలకు జేసీబీ సాయంతో లారీని తొలగించడంతో రాకపోకలు యథావిధిగా సాగాయి.