
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మోదీ పర్యటన ప్రత్యేక అధికారి వీరపాండియన్ పరిశీలించారు. మంగళవారం శ్రీశైలం చేరుకున్న ఆయన జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ ఇతర అధికారులతో కలిసి ప్రధాని పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా సున్నిపెంట హెలిపాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా శ్రీశైల భ్రమరాంబా అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, అధికారులు వారికి ఆహ్వానం పలికారు. అనంతరం నందిసర్కిల్, గంగాధర మండపం, అనంతరం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన, వేదాశీర్వచనం తదితర కార్యక్రమాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆతర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకుని శివాజీ కాంస్య విగ్రహం వద్ద, ధ్యాన మందిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. పనులు తర్వితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆర్డీవో నాగజ్యోతి తదితరులు ఉన్నారు.
మోదీ పర్యటన భద్రతపై సమీక్ష..
మోదీ పర్యటన నేపథ్యంలో ఐజీ ఆకే రవికృష్ణ మంగళవారం శ్రీశైలంలో పోలీసు ఉన్నతాధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. సుమారు 2,500 మంది పోలీసు సిబ్బందితో ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మోదీ పర్యటించే సున్నిపెంట హెలిపాడ్ నుంచి శ్రీశైలం వరకు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. సమీక్షలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, గ్రేహౌండ్స్ డీఐజీ బాపూజీ, నంద్యాల ఎస్పీ సునీల్‌షెరాన్, ప్రకాశం ఎస్పీ హర్ష వర్దన్‌రాజు, డీజీపీ ఆఫీసు అధిరాజ్ సింగ్ రాణా, ఐజీ అశోక్‌కుమార్, సీఐడీ ఎస్పీ శ్రీధర్‌రావు, ఎఎస్పీ యుగంధర్‌బాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, ఇతర సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన