
రైతు కష్టం..వర్షార్పణం
వివరాలు సేకరిస్తాం..
జిల్లాలోని మండలాల వారీగా వరి, పత్తి, మొక్కజొన్న పంటనష్టం వివరాలను సేకరిస్తున్నాం. ఏఈఓలు, ఏఓల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాకే నివేదిక రూపొందిస్తు న్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం.
– యశ్వంత్‌రావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ముసురు వాన కురుస్తోంది. సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం.. మంగళవారం రోజంతా కొనసాగింది. కోడేరు మండలంలో అత్యధికంగా 32.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, బల్మూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో 11 మి.మీ. మించి వర్షం కురిసింది. జిల్లాలో ఈసారి అధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికే పత్తి, మొక్కజొన్న పంటలు ఎర్రబారి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పొలాలు నీటమునిగి రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి.
పంట చేతికొచ్చేది కష్టమే..
జిల్లావ్యాప్తంగా వానాకాలంలో రైతులు 2.60 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగుచేశారు. సుమారు 1.60 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైంది. మరో 72వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశారు. అయితే ఈసారి మొదటి నుంచి అధిక వర్షాల ప్రభావంతో పంట చేళ్లలో నీరు నిలిచి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పత్తి పంటలో ఎక్కువ రోజుల పాటు నీరు నిలిచి ఉండటంతో మొక్కలు ఎర్రబారి స్వరూపాన్ని కోల్పోతున్నాయి. పత్తి పంట రంగుమారడంతో పాటు ఎదగడం లేదని రైతులు వాపోతున్నారు. ఈసారి యూరియా కొరతతో పాటు అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు ఎదగక.. కాయలు లేకుండా పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. పలుచోట్ల వరదలు వరి పొలాలను ముంచెత్తడంతో రైతులు నష్టపోయారు. పంటసాగుకు పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చేలా లేవని ఆందోళన చెందుతున్నారు.
వంగూరు6.5
బిజినేపల్లి 5
ఊర్కొండ 6
ఉప్పునుంతల మండలం తిరుమలాపూర్‌లో పూర్తిగా ఎర్రబారిన పత్తిపంట
అధిక వర్షాలతో ఎర్రబారుతున్న పత్తి
వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం
పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదని అన్నదాతల ఆందోళన
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఉప్పునుంతల మండలకేంద్రంలోని కదిరె బక్కయ్యకు చెందిన వరిపొలం. ఈసారి కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయ బావి నుంచి నీరు ఊటగా పారుతూ పొలాన్ని ముంచెత్తుతోంది. అధిక వర్షాలతో పంట పొలం మొత్తం నీటమునిగి ఉండటం.. జాలువారుతుండటంతో వరి, పత్తి
పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతు ఆందోళన చెందుతున్నాడు. అధిక వర్షాలతో పంట దిగుబడి చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నాడు.
నష్టపరిహారం దక్కేనా?
వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. జిల్లాలో అధిక వర్షాల ప్రభావంతో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటి వరకు కేవలం 311.24 ఎకరాల్లో మాత్రమే పంటలకు నష్టం కలిగినట్టు గుర్తించారు. ఇందులో అత్యధికంగా 207.4 ఎకరాల్లో వరిపంట ఉండగా.. మరో 103 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్టు వివరాలు సేకరించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందించే పరిహారంపై స్పష్టత కనిపించడం లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటలు నష్టపోయిన వారికి సకాలంలో నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

రైతు కష్టం..వర్షార్పణం