
భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండొద్దు
నాగర్‌కర్నూల్/లింగాల: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం లింగాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ రికార్డులతో పాటు సాదాబైనామాలు, ఇతరత్రా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే రైతులను పదే పదే తిప్పించుకోవద్దని అన్నారు. ప్రతి విభాగం సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ మాధవి, ఏడీఏ నాగేందర్, తహసీల్దార్ పాండునాయక్ తదితరులు ఉన్నారు.
వాల్మీకి మహర్షి చరిత్ర చిరస్మరణీయం
ప్రపంచం ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి జీవిత చరిత్ర ఉంటుందని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహా కవి వాల్మీకి రామాయణం ద్వారా సమాజానికి అనేక విలువలు అందించారన్నారు. మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి యాదగిరి, డీఎంహెచ్‌ఓ రవికుమార్, జిల్లా సర్వేయర్ నాగేందర్, డీవైఎస్‌ఓ సీతారాం నాయక్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీరాములు పాల్గొన్నారు.