
కాంగ్రెస్ మోసాలను ఎండగడుతాం
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లో ఎండగడుతామని, 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఎనిమిది హామీలతో కూడిన కాంగ్రెస్ బాకీ కార్డులను బుధవారం ఆవిష్కరించారు. 2023లో ఎన్నికల ముందు అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రతీ మహిళకూ రూ.2500 ఇస్తామని ఇవ్వలేదని, ఇలా ఒక్కో మహిళకు 22 నెలలుగా రూ.55 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. వృద్ధులకు పెన్షన్‌ను రూ.4 వేలు ఇస్తామని రూ.44వేలు బాకీ పడ్డారని, దివ్యాంగులకు రూ.44వేలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, రైతు భరోసాగా ప్రతీ రైతుకు రూ.2లక్షలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినిలకు స్కూటీ, విద్యాభరోసా కార్డులు బాకీ పడ్డారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ బాకీకార్డులను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించాలని బీఆర్‌ఎస్ శ్రేణులను కోరారు. బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్దాల ప్రచారం చేశారని, వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయొద్దని కోరారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారన్నారు. కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, టెస్కో మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, పార్టీ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్‌ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, సిద్ధం వేణు, గజభీంకార్ రాజన్న, పబ్బతి విజయేందర్‌రెడ్డి, జక్కుల నాగరాజు, ‘సెస్’ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌రావు, నారాయణరావు, హరిచరణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బాకీ కార్డులతో ఇంటింటికీ వెళ్తాం
ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్