
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): బీటెక్ చదివినా వార్షిక పరీక్షలో ఫెయిలయ్యాడు.. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసినా కలిసిరాక అప్పుల పాలయ్యాడు.. మనస్తాపం చెందిన గోప గోని అజయ్‌కుమార్(26) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన అజయ్‌కుమార్ హైదరాబాద్‌లో బీటెక్ చదివాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. పంటల పెట్టుబడి కోసం కొంత అప్పు చేశాడు. మరికొంత మద్యం తాగేందుకు వెచ్చించాడు. వ్యవసాయం కలిసిరాకపోవడం, అప్పులు తీర్చే దారిలేక, బీటెక్ కూడా ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఈనెల 4న పొలం వద్ద గడ్డిమందు తాగాడు. తాను గడ్డిమందు తాగి విషయాన్ని తన ఫ్రెండ్స్‌కు ఫోన్ ద్వారా చేరవేశాడు. వారి సమాచారంతో తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈనెల 7న రాత్రి మృతి చెందాడు. తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
మద్యానికి బానిసై..
మానకొండూర్: మానకొండూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సదాశివపల్లి గ్రామానికి చెందిన సాయిని మహిపాల్(35) మద్యానికి బానిసై బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ బి.సంజీవ్ వివరాల ప్రకారం.. మహిపాల్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. భార్యతో గొడవలతో ఐదేళ్లక్రితం విడాకులయ్యాయి. ఒంటరిగా ఉంటున్న మహిపాల్ మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి కనకమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.