
జనారణ్యంలోకి వన్యప్రాణి
● కుక్కకాట్లకు గురైన జింక
● చికిత్స అనంతరం అడవిలో విడిచిపెట్టిన అటవీ అధికారులు
ప్రత్తిపాడు: దారి తప్పి జనారణ్యంలోకి ఓ వన్యప్రాణి చొచ్చుకొచ్చింది. శునకాల బారిన పడి గాయపడింది. ప్రత్తిపాడులో శస్త్రచికిత్స చేయగా, తిరిగి అరణ్యంలోకి స్వేచ్ఛగా అడుగిడింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సమీప అటవీ ప్రాంతం నుంచి గొర్రెల మందతో పాటు ఓ జింక జనారణ్యంలోకి అడుగిడింది. రంగంపేట మండలం ఆనూరు గ్రామంలో ఓ గొర్రెల మందతో పాటు జింకను కాపర్లు గమనించారు. అప్పటికే అది కుక్కకాట్లకు గురై, గాయపడి ఉంది. ఈ మేరకు రంగంపేట గ్రామస్తులు జిల్లా అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఏలేశ్వరం డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.జాన్సన్ తన సిబ్బందితో రంగంపేట చేరుకుని, గాయపడిన జింకను చికిత్స కోసం ప్రత్తిపాడు ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ ఆ జింకకు శస్త్రచికిత్స అందించారు. కుదుటపడిన జింకను మంగళవారం సాయంత్రం ఏలేశ్వరం మండలం లింగంపర్తి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో విడిచిపెట్టినట్టు డిప్యూటీ రేంజ్ అధికారి జాన్సన్ తెలిపారు.