
మానవాళికి మార్గనిర్దేశకుడు వాల్మీకి
జాయింట్ కలెక్టర్ నిషాంతి
అమలాపురం రూరల్: వాల్మీకి మహర్షి జీవితం మానవాళికి మార్గదర్శకమని జేసీ టి.నిషాంతి అన్నారు. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ధర్మ పారాయణులకు నేటికీ మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత వాల్మీకి చిత్రపటానికి జేసీ నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి జీవితం దేశ సంస్కృతీ సంప్రదాయాలకు జీవనాధారమన్నారు. వాల్మీకి జీవితం గొప్ప సందేశమని, యువతరానికి మంచి ప్రేరణ అన్నారు. జ్ఞాన సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. రామాయణ మహాకావ్యం భారతీయ సంస్కృతికి, నైతిక విలువలకు గొప్ప మార్గమన్నారు. రామాయణ రచన ద్వారా సమాజంలో ధర్మానికి, సత్యానికి ప్రాముఖ్యమిచ్చారన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి.జ్యోతిలక్ష్మీదేవి, ఏవో కాశీవిశ్వేశ్వరరావు, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సుబ్బరాజు, వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
అమలాపురం టౌన్: రామాయణ మహా గ్రంథాన్ని జాతికి అందించిన మహర్షి వాల్మీకి చిరస్మరణీయుడని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీతో పాటు, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని ఎస్పీ వివరించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, ఎస్బీ సీఐ వి.పుల్లారావు, ఏఆర్ ఆర్‌ఐలు కోటేశ్వరరావు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

మానవాళికి మార్గనిర్దేశకుడు వాల్మీకి