మినీ జాబ్‌మేళాలో 81 మంది ఎంపిక
అమలాపురం రూరల్: వికాస ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో మినీ జాబ్‌మేళా జరిగింది. మొత్తం 123 మంది అభ్యర్థులు హాజరు కాగా, ఇంటర్వ్యూల్లో 81 మంది ఎంపికయ్యారు. వీరికి నియామక ఉత్తర్వులు అందించినట్టు కలెక్టర్ ఆర్ మహేష్‌కుమార్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వికాస కృషి చేస్తోందన్నారు. జాబ్ మేళా ద్వారా ఐటీ, ఫార్మా, కెమికల్స్, ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, ఎనర్జీ తదితర రంగాల్లో అవకాశాలను చేజిక్కించుకుని, జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలని యువతకు సూచించారు. సమాజంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ప్రైవేటు సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపికై న ఉద్యోగార్థులు ఆయా కంపెనీలకు వెళ్లాక వారి యోగక్షేమాలను పర్యవేక్షించాలని, ఎవరికీ అసౌకర్యం కలగకుండా మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వికాస ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు. వికాస పథక సంచాల కులు కె.లచ్చారావు, మేనేజర్ గోళ్ల రమేష్, హెచ్‌ఆర్‌లు పవన్‌కుమార్, ఎం.రవితేజ పాల్గొన్నారు.
కార్తిక మాస ఏర్పాట్లపై
నేడు సమావేశం
అన్నవరం: అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కార్తికమాసం ఏర్పాట్లపై బుధవారం వివిధ ప్రభుత్వ శాఖలు, దేవస్థానం అధికారుల సమన్వయ సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రకాష్‌సదన్ సత్రంలోని ట్రస్ట్‌బోర్డు హాలులో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.


