
బెత్తంతో గుణపాఠం
తప్పు చేసే విద్యార్థులను గాడిలో పెట్టడానికి టీచర్లు బెత్తం ఝుళిపిస్తారు. హోంవర్క్ ఎగ్గొట్టిన పిల్లల మాదిరిగా.. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా.. తమ కంట్లోనే కారం కొట్టేందుకు యత్నించిన కూటమి సర్కార్‌కు గట్టి గుణ‘పాఠం’ నేర్పేందుకు ఉపాధ్యాయులు ‘పోరుబాట’ అనే బెత్తం సిద్ధం చేశారు. అదిగో.. ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తూ.. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్న పాలకుల వైఖరిపై ఉద్యమ శంఖం పూరించారు.
రాయవరం: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన లబ్ధిని కలుగజేస్తామని, పీఆర్‌సీ వేస్తామని కూటమి కీలక నేతలు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. పీఆర్‌సీ వేయకపోగా, కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పైగా విద్యా సంస్కరణల పేరిట వారిపై పనిభారం మోపుతుండడంపైనా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూటీఎఫ్ రణభేరి పేరుతో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించి, ఉపాధ్యాయుల అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సమస్యల పరిష్కారం కోరుతూ తాజాగా పది ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాఫ్టో చలో విజయవాడకు పిలుపునిచ్చింది. జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో మంగళవారం చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.
ప్రతి పండగకూ నిరాశే..
కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తోంది. ఈ కాలంలో అనేక పండగలు వచ్చాయి.. వెళ్లాయి కానీ, ఉద్యోగులకు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. ప్రతి పండగకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత సంక్రాంతి పండగకూ ప్రభుత్వం పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించి ఐఆర్ ప్రకటిస్తారని, పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇస్తారని ఆశించారు. పాఠశాలల పునఃప్రారంభం రోజునా ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూశారు. అప్పుడూ నిరాశే ఎదురైంది. వినాయక చవితికి ఇస్తారని ఆశించినా ప్రభుత్వం కనికరించలేదు. దసరా పర్వదినానికి కచ్చితంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశించారు. అప్పుడూ పీఆర్‌సీ కానీ, డీఏలు కానీ ప్రకటించకుండా ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ పరిస్థితుల్లో పోరుబాటే శరణ్యమని భావించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాఫ్టో పోరుబాటకు సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉంది. ఒక్క డీఏ కూడా ఇప్పటి వరకు ప్రకటించక పోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.
దాచుకున్న డబ్బులకూ దిక్కులేదు
ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జీతభత్యాల నుంచి పీఎఫ్ మినహాయించుకుంటారు. వివిధ అవసరాల కోసం పీఎఫ్ సొమ్ము నుంచి డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ వంటి నిధుల నుంచి డబ్బు సకాలంలో మంజూరు కాకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం తదితర అవసరాలకు పీఎఫ్ నుంచి దాచుకున్న డబ్బు సకాలంలో మంజూరు కాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సరెండర్ లీవ్ బిల్లులూ మంజూరు కాకపోవడంతో ఆర్థిక అవసరాలు తీరక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 48 వేల మంది
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 48 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 18 వేల మంది వరకు ఉపాధ్యాయులున్నారు. వీరు కాకుండా మరో 30 వేల మంది పెన్షనర్లు ఉంటారు. ఉపాధ్యాయులు కాకుండా, వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులూ ఉన్నారు. ఇప్పటి వరకు వీరికి నాలుగు డీఏలను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. దసరాకు కనీసం రెండు డీఏలు విడుదలవుతాయని ఆశించినా వీరికి నిరాశే మిగిలింది.
దాటవేత ధోరణి సమంజసం కాదు
11వ పీఆర్‌సీ గడువు ముగిసి రెండేళ్లు పూర్తయినా, 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం దారుణం. దీనివల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలి. డిమాండ్లు అడుగుతుంటే, పరిశీలిస్తున్నామంటూ దాటవేత వైఖరిని ప్రభుత్వం అవలంబించడం సమంజసం కాదు.
– మేడిచర్ల త్రివెంకట ఆదిసత్య సుబ్బారావు, చైర్మన్,
ఫ్యాఫ్టో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
హామీలు తక్షణం అమలు చేయాలి
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణం నెరవేర్చాలి. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. నాలుగు డీఏల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా, ఇప్పటి వరకు కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించలేదు. పాత పీఆర్సీ బకాయిలూ ఇవ్వడం లేదు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి.
– పోలిశెట్టి దొరబాబు, ప్రధాన కార్యదర్శి,
ఫ్యాఫ్టో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
నమ్మక ద్రోహంపై
ఉపాధ్యాయ సంఘాల పోరుబాట
విద్యారంగ, ఆర్థిక సమస్యల
పరిష్కారమే కీలకం
నేడు చలో విజయవాడకు
ఫ్యాఫ్టో నేతల పిలుపు
జిల్లా నుంచి అధిక సంఖ్యలో
తరలివెళ్లనున్న ఉద్యోగులు,
ఉపాధ్యాయులు
పీఆర్సీ మాటేమిటి?
ఎన్నికల సమయంలో పీఆర్‌సీపై మంచి నిర్ణయం తీసుకుంటామని, ఐఆర్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా.. నేటికీ కనీసం పీఆర్‌సీ చైర్మన్‌గా ఎవరినీ నియమించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ చైర్మన్‌ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని ఆశగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనా విడుదల కాలేదు.
ముప్పేట దాడి
విద్యారంగ సమస్యలతో పాటు, ఆర్థికపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్‌జీవో సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఉపాధ్యాయ సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి ఈ నెల ఏడో తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా కలెక్టర్, డీఈవో కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు దిగాయి. ఏపీటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వారం చేపట్టగా, యూటీఎఫ్ రణభేరి కార్యక్రమం నిర్వహించింది. ఈ నెల ఏడున ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరుబాట పేరుతో విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఎన్జీవో నాయకులు సైతం వచ్చే రెండు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేనిపక్షంలో ఉద్యమ కార్యా చరణ చేపడతామని హెచ్చరించారు.

బెత్తంతో గుణపాఠం

బెత్తంతో గుణపాఠం