
పోలీస్ గ్రీవెన్స్‌కు 31 అర్జీలు
అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 31 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ పీవీఆర్‌పీబీ ప్రసాద్ వేర్వేరుగా తమ చాంబర్లలో గ్రీవెన్స్ నిర్వహించారు. పోలీస్ గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదులపై జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు అప్రమత్తంగా ఉండి, పరిష్కార చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించినవి ఉన్నాయి. అర్జీదారులతో ఎస్పీ, ఏఎస్పీ కౌన్సెలింగ్ తరహాలో చర్చించారు.
ఎస్బీ సీఐగా పుల్లారావు
జిల్లా స్పెషల్ బ్రాంచి (ఎస్‌బీ) సీఐగా వి.పుల్లారావు బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్బీ సీఐగా పనిచేస్తున్న పుల్లారావు భీమవరం నుంచి అమలాపురం ఎస్పీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఇప్పటి వరకూ ఎస్బీ సీఐగా పనిచేసిన బి.రాజశేఖర్ వీఆర్‌కు వెళ్లారు.
శిశు సంక్షేమ శాఖ పీడీగా నాగమణి
ముమ్మిడివరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నాగమణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మహిళా కమిషన్‌లో విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై ఆమె ఇక్కడికి వచ్చారు. స్థానిక శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమెకు జిల్లాలోని సీడీపీవోలు కలిసి అభినందనలు తెలిపారు.
నేడు జెడ్పీ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్టు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జెడ్పీ పరిధిలోని కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు పాల్గొనాలని కోరారు.
ఘనంగా పవిత్రోత్సవాలు
పెరవలి: అన్నవరప్పాడు అలివేలు మంగా వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం హోమం నిర్వహించారు. నూలు దండలతో స్వామి, అమ్మవార్ల మూర్తులను రూపొందించి, కలశ పూజతో పాటు వివిధ అర్చనలు నిర్వహించారు. పవిత్రోత్సవాలకు సంబంధించిన వివిధ క్రతువులు రాత్రి 9 గంటల వరకూ జరుగుతాయని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితుల సుస్వర వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తుల గోవింద నామోచ్ఛారణ ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.

పోలీస్ గ్రీవెన్స్‌కు 31 అర్జీలు