
భక్తుల్లో అదే అసంతృప్తి
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వివిధ సేవలపై దాదాపు 30 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకూ రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా అన్నవరం దేవస్థానంలో లభిస్తున్న సేవలపై గత ఆగస్టు మాదిరిగానే ఈసారి కూడా దాదాపు 30 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
● సత్యదేవుని దర్శనంపై జూన్‌లో 73, జూలైలో 74, ఆగస్టులో 75.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా సర్వేలో అది 74.1 శాతంగా నమోదైంది.
● మౌలిక వసతుల కల్పనలో జూన్ 66, జూలైలో 65, ఆగస్టులో 64.9 శాతం మంది సంతృప్తి చెందగా సెప్టెంబర్‌లో అది 66 శాతంగా ఉంది.
● స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై జూన్‌లో 77, జూలైలో 78, ఆగస్టులో 76.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. ఈసారి అది 79.2 శాతానికి పెరిగింది.
● పారిశుధ్యంపై జూన్‌లో 70, జూలైలో 68, ఆగస్టులో 66.5 మంది మాత్రమే సంతృప్తి చెందగా, సెప్టెంబర్‌లో అది 64.5 శాతానికే పరిమితమైంది.
కార్తికం నాటికి
చక్కదిద్దాలి
ఈ నెల 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతోంది. ఆ నెలంతా రత్నగిరికి భక్తుల తాకిడి ఉంటుంది. పర్వదినాల్లో లక్ష మందికి పైగా వస్తారు. ఆ సమయంలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోతే ప్రభుత్వ సర్వేల్లో దేవస్థానం పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుంది. కేవలం ఈఓ మీదనే బాధ్యత వదిలేయకుండా దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం కూడా సరైన మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు అవసరమైతే ప్రత్యేకాధికారిని నియమించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భక్తుల్లో అదే అసంతృప్తి