
పోటీతత్వం పెంచేందుకు స్వచ్ఛత అవార్డులు
అమలాపురం రూరల్: స్వచ్ఛత కార్యక్రమాల్లో అగ్రగామిగా గ్రామాలను నిలపడం, గ్రామాల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రేరణగా స్వచ్ఛత అవార్డులు నిలుస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. సోమవారం అమలాపురం సత్యనారాయణ గార్డెన్‌లో జిల్లా స్థాయిలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం–2025 ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేశారు. స్వచ్ఛత రంగంలో గుర్తింపు పొందిన మున్సిపాలిటీలకు, పంచాయతీలకు, స్కూళ్లు, ఆస్పత్రులు, కార్యాలయాలు, రైతు బజార్లు, బస్సు స్టేషన్లు, పారిశుధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాలకు అవార్డులు జారీ చేశారన్నారు. స్వచ్ఛత, పారిశుధ్యం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ, ఘనీభవ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహం వంటి విధానాలను పురోగమింపజేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ, ఈ అవార్డులు మరింత జవాబుదారీతనం, పారదర్శకత, ప్రేరణ ఇచ్చేందుకు ఉద్దేశించబడ్డాయన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికై న ఆత్రేయపురం మండలం లొల్ల పంచాయతీకి సీఎం అవార్డును ప్రదానం చేశారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.మాధవి, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, సీపీవో మురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నుంచి అవార్డులు అందుకున్న వారు