
వాన లేదు.. వరద వదల్లేదు
ఫ నైరుతిలో లోటు వర్షపాతం
ఫ ఇదే సమయంలో గోదావరికి ఐదుసార్లు వరద
ఫ అంచనాల కన్నా అధికంగా ఇన్‌ఫ్లో
సాక్షి, అమలాపురం: నైరుతి నిష్క్రమణ సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది లోటు వర్షాన్ని మిగిల్చింది. జిల్లాలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ ప్రతి నెలా లోటు వర్షమే పడింది. ఇదే సమయంలో గోదావరి పోటెత్తింది. వరుసగా ఐదుసార్లు వచ్చి పడిన వరద గోదావరి లంక వాసులను ఇబ్బందుల పాల్జేసింది.
జిల్లాలో ఈ ఏడాది లోటు వర్షం నమోదైంది. జూన్ నుంచి ఇప్పటి వరకూ ప్రతినెలా సగటు కన్నా తక్కువ వర్షమే పడింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 111.4 మిల్లీ మీటర్లు కాగా, ఆ నెలలో 105.9 మిల్లీ మీటర్లు మాత్రమే పడింది. ఇది సాధారణం కన్నా 4.9 శాతం తక్కువ. ఇక జూలైలో సాధారణ వర్షపాతం 241 మిల్లీమీటర్లు కాగా, 112.2 మిల్లీమీటర్లు పడింది. ఇది సగటు కన్నా 53.4 శాతం లోటు కావడం విశేషం. ఆగస్టులో సాధారణ వర్షం 229.7 మిల్లీమీటర్లు కాగా, 203.5 మిల్లీమీటర్లు కురిసింది. ఇది సగటు కన్నా 11.4 శాతం లోటు కావడం గమనార్హం. ఇక సెప్టెంబర్‌లో సాధారణ వర్షం 196.8 మిల్లీమీటర్లు కాగా, 117.7 మిల్లీమీటర్లు పడింది. ఇది సగటు కన్నా 40.2 శాతం తక్కువ. ఇక అక్టోబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ 42.9 మిల్లీ మీటర్లు కాగా, కురిసింది 7.6 మిల్లీ మీటర్లు. ఇది సగటు కన్నా 82.3 శాతం తక్కువ. జూన్ 1 నుంచి అక్టోబరు 4 వరకూ సాధారణ వర్షపాతం 825.3 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకూ 546.9 మిల్లీ మీటర్లు కురిసింది. ఇది సగటు కన్నా 44 శాతం లోటు వర్షం కావడం గమనార్హం.
బాబోయ్.. ఐదుసార్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మెట్ట రైతులు వర్షం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. కానీ విచిత్రంగా ఈ ఏడాది గోదావరికి మాత్రం వరుసగా వరదలు వచ్చాయి. భారీగా కాకున్నా ఏకంగా ఐదుసార్లు వరద పోటెత్తడం విశేషం. సెప్టెంబర్‌లోనే మూడుసార్లు వచ్చింది. జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకూ ఈ నెల 4వ తేదీ వరకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు ఇన్‌ఫ్లో 3,969.478 టీఎంసీలుగా నమోదైంది. ఆగస్టుతో పోల్చుకుంటే ఇది చాలా అధికం. ఆగస్ట్ నెలాఖరు నాటికి ఇన్‌ఫ్లో కేవలం 1,998.787 టీఎంసీలు మాత్రమే. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 1,970 టీఎంసీల నీరు వచ్చింది. వచ్చిన నీటిలో 112.023 టీఎంసీల నీటిని గోదావరి డెల్టా పరిధిలోని మూడు ప్రధాన పంట కాలువలకు వదిలారు. తూర్పు డెల్టాకు 39.191, మధ్య డెల్టాకు 19.562, పశ్చిమ డెల్టాకు 53.270 టీఎంసీల నీరు విడుదల చేశారు. ఇక దిగువనకు 3,857.455 టీఎంసీల వృథా జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. సాధారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులకు లోపు ఉంటోంది. అటువంటిది ఇప్పుడు ఏకంగా 6,51,647 టీఎంసీలు ఉండడం గమనార్హం. సెప్టెంబర్‌లో తరచూ గోదావరి పోటెత్తడానికి తెలంగాణలో కురిసిన భారీ వర్షాలే కారణం. దీనికితోడు గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియాలోకి వచ్చే ఒడిశా, ఛతీస్‌ఘడ్‌లో కూడా వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల ఇన్‌ఫ్లో ఇప్పటికీ అంచనాలకు మించి వస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే గోదావరి ఇన్‌ఫ్లో పెరగడం వల్ల వచ్చే రబీ రైతులకు మేలు జరుగుతోందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

వాన లేదు.. వరద వదల్లేదు