అంబరాన్నంటిన దసరా సంబరాలు | - | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన దసరా సంబరాలు

Oct 4 2025 2:12 AM | Updated on Oct 4 2025 2:12 AM

అంబరా

అంబరాన్నంటిన దసరా సంబరాలు

గగుర్పాటు కలిగించిన

చెడీ తాలింఖానా విన్యాసాలు

కత్తులు తిప్పిన ప్రజాప్రతినిధులు

అమలాపురం టౌన్‌: విజయ దశమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన అమలాపురం దసరా ఉత్సవాలు, ఊరేగింపుల సంబరాలు గురువారం అంబరాన్ని అంటాయి. పట్టణంలోని ఏడు వీధులైన కొంకాపల్లి, మహిపాల వీధి, నల్లా వీధి, గండువీధి, రవణం వీధి, శ్రీరామపురం, రవణం మల్లయ్యవీధిలకు చెందిన దేవతా మూర్తుల వాహనాలతో ఊరేగింపులు వైభవంగా జరిగాయి. జిల్లాలోని వారే కాకుండా సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా అమలాపురానికి తరలివచ్చి దసరా ఊరేగింపులను వీక్షించారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు ఏడు వీధుల ఊరేగింపుల సమ్మేళనంతో ఉత్సవాలు జరిగాయి. ఊరేగింపుల్లో చెడీ తాలింఖానా ప్రదర్శనలు ఉత్కంఠ భరితంగా, గగుర్పాటు కలిగించేలా సాగాయి. కళ్లకు గంతలు కట్టుకుని నేలపై పడుకున్న వ్యక్తి ఉదరం, పీకలపై కొబ్బరి కాయలు, కూరగాయలు ఉంచి పట్టా కత్తితో నరికే సన్నివేశాలను చూసేందుకు జనం ఎగబడ్డారు. అగ్గి బరాటాల విన్యాసాలు, లేడి కొమ్ములు, బల్లేలతో పోరాటాలు, కర్ర సాముతో సాగిన ప్రదర్శనలతో ఊరేగింపులు హోరెత్తాయి. రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్‌, ఎంపీలు గంటి హరీష్‌మాధుర్‌, సానా సతీష్‌, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పలు వీధుల దసరా ఉరేగింపుల్లో పాల్గొని కొద్దిసేపు సరదాగా కత్తులు తిప్పారు. అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ ఊరేగింపుల్లో పాల్గొని సరదాగా కత్తులు,కర్రలు తిప్పారు. ఎస్పీ రాహుల్‌ మీనా ఆధ్వర్యంలో అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో దాదాపు 500 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఏడు వీధుల ఊరేగింపుల వద్ద అడుగడుగునా పోలీసులు వలయంగా మోహరించి ఆయుధాల ప్రదర్శనలతో సాగిన చెడీ తాలింఖానా బృందాలను పర్యవేక్షించారు. ఏడు వీధుల ఊరేగింపులతో అమలాపురం పట్టణం కత్తుల సవ్వడితో హోరెత్తింది. చెడీ తాలింఖానా ప్రదర్శనలకు తోడు ప్రతీ వీధి ఊరేగింపులో శక్తి వేషాలు, తీన్‌ మార్‌ డప్పులు ఇలా ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమలాపురంలో ఊరేగింపులు సాగిన మెయిన్‌ రోడ్లన్నీ జనం రద్దీతో నిండిపోయాయి. ఇళ్ల అరుగులపై, డాబాలపై ఎటు చూసినా జనమే. వారు ఊరేగింపులను ఉత్కంఠగా, ఉత్సాహంగా తిలకించారు.

ఊరేగింపులను వీక్షించిన డీఐజీ

ఏడు వీధుల దసరా ఊరేగింపుల సమ్మేళనాన్ని ఏలూరు రేంజ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ శుక్రవారం తెల్లవారు జామున వీక్షించారు. గడియారం స్తంభం సెంటరులోని పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో వద్ద ఐజీ, ఎస్పీ, ఏఎస్పీలు ఊరేగింపులను దాదాపు గంటన్నర పాటు వీక్షించారు. ఊరేగింపుల్లో భాగంగా రవణం వీధి మహిషాసుర మర్ధినిదేవి ఉత్సవ వాహనానికి ఐజీ, ఎస్పీలు ప్రత్యేక పూజలు చేశారు.

అంబరాన్నంటిన దసరా సంబరాలు1
1/4

అంబరాన్నంటిన దసరా సంబరాలు

అంబరాన్నంటిన దసరా సంబరాలు2
2/4

అంబరాన్నంటిన దసరా సంబరాలు

అంబరాన్నంటిన దసరా సంబరాలు3
3/4

అంబరాన్నంటిన దసరా సంబరాలు

అంబరాన్నంటిన దసరా సంబరాలు4
4/4

అంబరాన్నంటిన దసరా సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement