
వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులుగా మాజీ ఎంపీ అనురాధ
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కోనసీమ జిల్లా చెందిన నలుగురిని సీఈసీ సభ్యులుగా ఎంపిక చేశారు. చింతా అనురాధతో పాటు పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, పార్టీ సీనియర్ నాయకులు పేరి కామేశ్వరరావు, పితాని బాలకృష్ణలను నియమించారు. వీరితో పాటు జిల్లాకు చెందిన ఐదుగురిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన సాకా మణికుమారి, అమలాపురం నియోజకవర్గానికి చెందిన కుడిపూడి వెంకటేశ్వరరావు (బాబు), కుడుపూడి భరత్ భూషణ్, పి. గన్నవరం నియోజకవర్గానికి చెందిన నేలపూడి స్టాలిన్‌బాబు, ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన కాశీ ముని కుమారిని ఎంపిక చేశారు.
గాంధీజీ స్ఫూర్తితో సాగాలి
అమలాపురం రూరల్: గాంధీజీ జయంతి మనకు మానవతా విలువలు, శాంతి, సత్యం, అహింసా మార్గాల పట్ల నిబద్ధతను గుర్తు చేస్తుందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా గురువారం ఆయన కాంస్య విగ్రహానికి కలెకక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ గాంధీజీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వ్యక్తిగత జీవితంలోను, సమాజంలోను ఆయన విలువలను పాటించడానికి ప్రయత్నించాలన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణమూర్తి ఏవో కాశీ విశ్వేశ్వరరావు, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ పాల్గొన్నారు.
7న ఫ్యాప్టో పోరుబాట
అమలాపురం టౌన్: విజయవాడలో ఈ నెల 7న జరగనున్న ఫ్యాప్టో పోరుబాట నిరసన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల ఆర్ధిక, ఇతర సమస్యలపై రాష్ట్ర ఫ్యాప్టో తలపెట్టిన ఈ మహా ధర్నాకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అన్ని యూనియన్లకు చెందిన ఉపాధ్యాయులు విధిగా హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమలాపురంలోని ఎస్టీయూ జిల్లా విద్యా భవనంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయుల సన్నాహాక సమావేశంలో సాయి శ్రీనివాస్ మాట్లాడారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎంటీవీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం నేటి ఉపాధ్యాయులు ఈ కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించింది. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం తదితర సమస్యలపై ఉపాధ్యాయులు నిరసన బాట పట్టారని ఆయన గుర్తు చేశారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ పోతంశెట్టి దొరబాబు, సంఘ ప్రతినిధులు మోకా ప్రకాష్, రాయుడు ఉదయభాస్కర్, నాగిరెడ్డి శివ ప్రసాద్ ప్రసంగించారు. నిరసన పోరు పోస్టర్లను విడుదల చేశారు.
అండర్ –14, 17
బాలబాలికలకు ఎంపికలు
అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ –14, 17 బాల బాలికలకు ఈనెల 4 ,7 తేదీలలో క్రీడా పోటీలు, జిల్లా జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీంబాషా ఒక ప్రకటనలో తెలిపారు. 4 వ తేదీన ఆత్రేయపురం మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో నెట్‌బాల్ ఎంపికలు, 7 వ తేదీన మలికిపురం మండలం గుడిమెళ్ళంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాల్కాంబ్ జిల్లా జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలని డీఈవో కోరారు. ఇతర వివరాలకు ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు కొండేపూడి ఈశ్వరరావు సెల్ నెంబర్ 93469 20718, ఎన్‌ఎస్ రమాదేవి సెల్ నెంబర్ 94400 94984 సంప్రదించాలన్నారు.

వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులుగా మాజీ ఎంపీ అనురాధ