
జయజయహే మహిషాసుర మర్దని..
రామచంద్రపురం రూరల్/అమలాపురం టౌన్: పంచారామ క్షేత్రాలు.. త్రిలింగ క్షేత్రాలు.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాలలో పదో రోజైన బుధవారం అమ్మవారి మట్టి ప్రతిమను ఆ రూపంలో అలంకరించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని ఆధ్వర్యంలో మేలుకొలుపు, ప్రభాత సేవ, సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన, తీర్థపు బిందె, బాలభోగం, ప్రధమాభిషేకం, ప్రధమార్చనల అనంతరం అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అమలాపురం పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లు మహిషాసుర మర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక శ్రీదేవి ఆలయం, గోల్డ్ మార్కెట్‌లోని కామాక్షీ ఏకామ్రేశ్వరీదేవి ఆలయం, వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలోని వైష్ణవీ కనకదుర్గ ఆలయం, వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం, హౌసింగ్ బోర్డు కాలనీలోని కల్యాణ దుర్గ ఆలయాల్లోని అమ్మవార్లతోపాటు కామాక్షీ పీఠంలోని శ్రీకామాక్షీదేవి మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు.

జయజయహే మహిషాసుర మర్దని..