
బాణసంచా తయారీలో అప్రమత్తం
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. అయినవిల్లి మండలం విలస గ్రామంలో మంగళవారం బాణసంచా ప్రమాదంలో భార్య భార్తలు మృతిచెందడం బాధాకరమని ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాణసంచా తయారీ, నిల్వ కోసం మంజూరు చేసిన లైసెన్సులు, వాటి రెన్యూవల్ వివరాలను సమర్పించాలని ఆదేశించారు. సంబంధిత శాఖల సిబ్బంది తమ పరిధిలోని బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలను తనిఖీ చేయాలని, రక్షణ చర్యలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
విజయ దశమి శుభాకాంక్షలు
గురువారం విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజల జీవితాలలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం విజయ దుర్గమ్మ నింపాలని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
రెడ్‌క్రాస్ ఎన్నికలు వాయిదా
ఈ నెల మూడో తేదీన నిర్వహించనున్న జిల్లాస్థాయి రెడ్‌క్రాస్ ఎన్నికలు అని వార్య కారణాలవల్ల వాయిదా వేసినట్టు కలెక్టర్ బుధవారం తెలిపారు. వరుసగా దసరా సెలవులు రావడం, గోదావరి నదికి వరదల వల్ల వాయిదా వేశామని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ తెలియజేస్తామని ఆయన తెలిపారు.
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
ఈ నెల ఐదున పంపిణీ చేయనున్న కాత్వా
అమలాపురం టౌన్: చదువులో ప్రతిభ కనబరుస్తున్న వెయ్యి మంది పేద కాపు విద్యార్థులకు ఈనెల 5న కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కాత్వా) ఆధర్యంలో రూ.70 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్లు జిల్లా కాత్వా అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులు అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ చేతుల మీదుగా కాత్వాకు భారీగా విరాళాలు అందజేశారు. అమలాపురంలోని కల్వకొలను వీధిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తాతాజీకి, కాత్వా ప్రతినిధులకు ఆ మొత్తాలను అందించారు. కాపు నాయకులు తాడి నరసింహారావు, బండిగుప్తాపు పాండురంగారావు, బోనం కనకయ్య, గంధం పల్లంరాజు, త్సవటపల్లి నాగబాబు, జయన సత్తిరాజు బూరి విరాళాలు అందించారు. ఈనెల 5న స్థానిక సత్యనారాయణ గార్డెన్స్‌లో వీటిని పంపిణీ చేయనున్నట్టు కాత్వా జిల్లా ప్రధాన కార్యదర్శి నందెపు శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం గుంటూరు తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్రప్రభు రూ.30 లక్షల విరాళం ఇచ్చినట్లు కాత్వా జిల్లా గౌరవాధ్యక్షుడు పప్పుల శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు 2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన ఒక కాపు విద్యార్థికి రూ.లక్ష నగదు బహుమతి అందివ్వనున్నారని కాత్వా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కం మైనర్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా స్కాలర్ షిప్‌ల పంపిణీ కర పత్రాలను విడుదల చేశారు.

బాణసంచా తయారీలో అప్రమత్తం