
అంధుల చదువులపై ఔదార్యం
● విద్యార్థులకు సొంత గూడు ఏర్పాటు
● రూ.60 లక్షలతో లూయీ బ్లైండ్ స్కూల్
● గత ప్రభుత్వంలో రూ.35 లక్షలు కేటాయింపు
సాక్షి, అమలాపురం: అంధ విద్యార్థులకు సొంత గూడు కల్పించాలన్న గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. అమలాపురంలో సుమారు 25 మంది అంధులు స్థానిక బూపయ్య అగ్రహారంలోని మున్సిపల్ పాఠశాలలో నివసిస్తూ చదువుకుంటున్నారు. రామాయణం శ్రీనివాసరావు రెండు దశాబ్దాలుగా లూయీ అంధుల పాఠశాల పేరుతో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ బ్రెయిలీలో విద్యా బోధన చేస్తున్నారు. తొలుత ఇక్కడ భవనం తుపానుకు దెబ్బతినడంతో తరువాత రేకుల షెడ్ వేసి నిర్వహించారు. తరువాత వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా, సొంత గూడు కల్పించాలని శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో నాటి మంత్రి పినిపే విశ్వరూప్‌ను కలిసి అభ్యర్థించారు. చమురు సంస్థలకు చెందిన సీఎస్సార్ నిధులు రూ.20 లక్షలు, ఓఎన్జీసీ నుంచి రూ.పది లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలు కేటాయించారు. అలాగే మాజీ ఎంపీ చింతా అనూరాధ రూ.ఐదు లక్షల ఎంపీ నిధులు కేటాయించారు. ఇలా మొత్తం రూ.60 లక్షలలో సింహభాగం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేటాయించింది. పంచాయతీ రాజ్ ప్రాజెక్టు విభాగం ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభించి గత ప్రభుత్వ హయాంలోనే ఓ కొలిక్కి తీసుకువచ్చింది. అనంతరం ప్రభుత్వం మారిన తరువాత ఏడాదిన్నర కాలానికి పూర్తి చేశారు. ఈ భవనాన్ని 5,900 చదరపు గజాలలో నిర్మించారు. ఒక గది 40 ఇన్‌టు 18, మరో గది 22 ఇన్‌టు 18 చొప్పున నిర్మించారు. విశాలమైన వంట గది ఉంది. ఈ భవనాన్ని బుధవారం రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులు ప్రారంభించారు.