
ఏడు వీధుల ఊరేగింపునకు పటిష్ట బందోబస్తు
● 10 డ్రోన్ కెమెరాలతో నిఘా
● కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పర్యవేక్షణ
● జిల్లా ఎస్పీ రాహుల్ మీనా
అమలాపురం టౌన్: అమలాపురంలో గురువారం జరగనున్న ఏడు వీధుల దసరా ఊరేగింపులకు పూర్తి స్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఏడు వీధుల ఊరేగింపుల కదిలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు 10 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. డ్రోన్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలు, సోలార్ సీపీ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెలు, వీడియోలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో దసరా ఊరేగింపుల నిరంతర పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 500 మందికి పైగా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో దసరా ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్‌ను కూడా మళ్లించినట్లు తెలిపారు. పట్టణంలోకి ఏ వాహనం రాకుండా ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను సూచించామన్నారు. దసరా ఊరేగింపులను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ఏడు వీధుల ఉత్సవ కమిటీల ప్రతినిధులు సహకరించాలని ఎస్పీ మీనా విజ్ఞప్తి చేశారు. కమిటీల ప్రతినిధులే అందుకు బాధ్యత వహించాలని సూచించారు.