
చేనేత కార్మికులను విస్మరిస్తే చరిత్రను విస్మరించినట్టే.
కపిలేశ్వరపురం: భారతీయ నైపుణ్యం, సంప్రదాయాలకు ప్రతీకగా చేనేత వృత్తి విరాజిల్లిందని, అంతటి ప్రాశస్త్యం గల చేనేత కార్మికులను విస్మరిస్తే చరిత్రను విస్మరించినట్టే అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. తమ చేనేత సంఘానికి వివిధ పథకాల ద్వారా రావాల్సిన రాయితీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సంఘం ఎదుట రిలే నిరాహా దీక్ష చేస్తున్న చేనేత కార్మికులకు ఎమ్మెల్సీ తోట సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గూటం సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు అడ్డాల శ్రీనివాస్‌తో కలిసి చేనేత కార్మికుల నిరసన శిబిరంలో పాల్గొన్నారు. శ్రీ గణపతి చేనేత సహకార సంఘానికి ప్రభుత్వం నుంచి రూ.3.85 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, వాటిని వెంటనే విడుదల చేయకపోతే సంఘం నిర్వహణ అగమ్య గోచరమవుతుందంటూ నేత కార్మికులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేసిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు నేతన్నకు ఏడాదికి రూ.25వేలు ఆర్థిక సాయాన్ని, రెండు వందలు యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సదుపాయాన్ని అమలు చేయలేదని విమర్శించారు. వైస్ ఎంపీపీ గుణ్ణం భానుప్రసాద్, గుడిమెట్ల రాంబాబు, శలా సుబ్రహ్మణ్యం, మత్సా గణేశ్వరరావు, శలా వీర్రాజు, తేలు సత్యనారాయణ, బళ్లా కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తోట