సమస్యల నాడి పట్టరేం? | - | Sakshi
Sakshi News home page

సమస్యల నాడి పట్టరేం?

Sep 30 2025 7:59 AM | Updated on Sep 30 2025 7:59 AM

సమస్య

సమస్యల నాడి పట్టరేం?

కూటమి ప్రభుత్వంపై వైద్యుల గుర్రు

విధులు బహిష్కరించి సమ్మెలోకి

పీహెచ్‌సీల డాక్టర్లు

జిల్లాలో పలుచోట్ల నర్సులతోనే

వైద్య సేవలు

సాక్షి, అమలాపురం/ ముమ్మిడివరం: చెప్పి చెప్పి విసిగిపోయారు.. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని మొరపెట్టుకున్నా, కూటమి సర్కారు పట్టించుకోక పోవడంతో వైద్యులు స్టెత్‌ను పక్కనపెట్టారు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమ్మెకు దిగారు. ఫలితంగా పల్లెల్లో వైద్య సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) వైద్యులు విధులను బహిష్కరించారు.

తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 53 పీహెచ్‌సీలు ఉండగా, ప్రతి చోటా వైద్యులు విధులకు దూరంగా ఉన్నారు. అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని, ఓపీ, ఇతర సేవలకు దూరంగా ఉంటామని తేల్చి చెప్పారు. వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని గత ఏడాది ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ బుట్టదాఖలు కావడంతో వారు సమ్మె బాట పట్టారు. గత 20 ఏళ్ల నుంచి తమకు పదోన్నతులు లేకుండా పోయాయని, టైమ్‌ బాండ్‌ పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. జీఓ 99ను రద్దు చేసి ఇన్‌ సర్వీస్‌ పీజీ కోటాను పునరుద్ధరించాలని, నోషల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న వైద్యులకు 50 మూల వేతనాన్ని గిరిజన భత్యంగా అందించాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేల భత్యం ఇవ్వాలనే తదితర డిమాండ్లతో వారు సమ్మెకు దిగారు. ఆయా పీహెచ్‌సీల వద్ద తమ డిమాండ్‌లో కూడిన నోటీసులు అతికించి ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్‌సీలలో వైద్యుల ద్వారా అందాల్సి సేవలు నిలిచిపోయాయి. చివరకు జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్థ్‌ నారీ– – సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ క్యాంపులో కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు సేవలందించాల్సి వచ్చింది.

ఉన్నవారితో మమ అనిపించి..

● మండపేట నియోజకవర్గం పరిధిలో మండపేటలో రెండు, కపిలేశ్వరపురంలో మూడు, రాయవరం రెండు పీహెచ్‌సీలు ఉన్నాయి. వైద్యులు విధులకు హాజరు కాలేదు. రోగులకు స్థానికంగా ఉన్న ఫార్మసిస్టులు, నర్సులు తాత్కాలికంగా మందులు అందించి పంపించారు. చిన్న చిన్న పరీక్షలను నర్సులు నిర్వహించారు. ఓపీ లేకపోవడంతో గ్రామీణ ప్రజలకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. దీనితో వారు ప్రైవేట్‌ వైద్యులను, ఆర్‌ఎంపీలను ఆశ్రయించాల్సి వచ్చింది.

● ముమ్మిడివరం నియోజకవర్గం కొత్తలంక పీహెచ్‌సీలో సోమవారం ఇద్దరు వైద్యులూ సమ్మెలో ఉండటంతో ఆసుపత్రి స్టాఫ్‌ నర్సు, ఫార్మాసిస్ట్‌ రోగులకు వైద్య సేవలందించారు. స్టాఫ్‌ నర్సు పి.నాగలక్ష్మి, ఫార్మసిస్ట్‌ ఎం.శ్రీనివాస్‌లు రోగులకు ప్రాథమిక పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ ఒక్క రోజు 38 మంది ఆసుపత్రికి వచ్చి సేవలు పొందారని తెలిపారు. అయితే రిఫరల్‌ కేసులు ఏవీ రాకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. కాట్రేనికోన పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సులు వైద్య సేవలందించారు. 83 ఓపీ నమోదైంది. సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పల్లంకుర్రు పీహెచ్‌సీకి మత్స్యకార గ్రామాల నుంచి జ్వరపీడితులు, ఇతర వ్యాధిగ్రస్తులు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

● రామచంద్రపురం నియోజకవర్గంలో మొత్తం ఏడు పీహెచ్‌సీలు ఉండగా వైద్యుల ద్వారా సేవలందలేదు. కేవలం నర్సులు మాత్రమే ప్రాథమిక చికిత్స చేసి పంపారు.

● రాజోలు నియోజకవర్గం పరిధిలో ఏడు పీహెచ్‌సీలు ఉండగా వైద్యులు విధులు హాజరు కాలేదు. స్టాఫ్‌ నర్సుల ద్వారా వైద్య సేవలందించారు. స్వస్థ్‌ నారీ – సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ క్యాంప్‌లో కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు సేవలందించారు.

● కొత్తపేట నియోజకవర్గం పరిధిలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక్కడ మొత్తం ఎనిమిది పీహెచ్‌సీలు ఉండగా, ప్రతిచోటా వైద్యుడి స్థానంలో స్టాఫ్‌ నర్సులు వైద్య సేవలందించాల్సి వచ్చింది.

సమస్యల నాడి పట్టరేం?1
1/3

సమస్యల నాడి పట్టరేం?

సమస్యల నాడి పట్టరేం?2
2/3

సమస్యల నాడి పట్టరేం?

సమస్యల నాడి పట్టరేం?3
3/3

సమస్యల నాడి పట్టరేం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement