
శిక్షణకు వచ్చేసారు
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగా విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకూ శిక్షణ ఉంటుంది. భోజన వసతితో పాటు ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందే
కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో శిక్షణకు హాజరు కావాల్సిందే. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో మొత్తం ఏడు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం.
– జి.నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
● డీఎస్సీ–2025 ఉపాధ్యాయులకు
బోధనలో మెళకువలు
● ఉమ్మడి జిల్లా పరిధిలో
1,698 మందికి తరగతులు
● వచ్చే నెల 3 నుంచి 10 వరకూ నిర్వహణ
● చివరి రోజు శిక్షణ కేంద్రాల్లోనే
పోస్టింగ్ ఆర్డర్లు
రాయవరం: డీఎస్సీలో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 1,352 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే నాలుగు పోస్టులకు అర్హులు లేక 1,349 పోస్టులకు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే జోన్–2 పరిధిలోని 347 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు (పీజీటీ)కు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 1,698 మందికి ఏడు చోట్లలో శిక్షణ ఇస్తారు. విధుల్లో చేరే ముందే కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులకు బోధనలో మెలకువలు నేర్పేందుకు సబ్జెక్టుల వారీగా సమాయత్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలోనే ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యా బోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేయడం శిక్షణ ప్రధాన ఉద్దేశం. అలాగే విద్యా శాఖ ప్రవేశపెట్టిన విధి విధానాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు విద్యాహక్కు, బాలల హక్కు చట్టాలు, అందులోని ముఖ్య విషయాలను తెలియజేయడం, బాధ్యతలు వివరించడం, పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం, మూల్యాంకన విధానాలు నేర్పించడం, డిజిటల్ టూల్స్, టెక్నాలజీ ద్వారా కొత్త బోధన విధానాలను పరిచయం చేయడం, వృత్తి నైపుణ్యం, నియమాలు పాటించడం, విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం తదితర అంశాలపై వీరికి 8 రోజుల శిక్షణలో అవగాహన కల్పిస్తారు.
10న పోస్టింగ్ ఆర్డర్లు
అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకూ శిక్షణ ఇచ్చేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో శిబిరాలను ఏర్పాటు చేశారు. 527 మంది ఎస్జీటీలు, 132 మంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, 211 మంది ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, 236 మంది ఎస్‌ఏ తెలుగు, ఇంగ్లిషు, హిందీ, 245 మంది ఎస్‌ఏ గణితం, పీఎస్, బయాలజీ టీచర్లకు శిక్షణ ఇస్తారు. వీరితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో ఎంపికై న పీజీటీలకు కూడా రాజమహేంద్రవరంలోనే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ శిబిరం చివరి రోజు 10న ఆయా శిక్షణ కేంద్రాల్లోనే కౌన్సెలింగ్ ఏర్పాటు చేసి, పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ 13న నూతన ఉపాధ్యాయులు విధుల్లో చేరాల్సి ఉంటుంది.
రిలీవ్ కానున్న బదిలీ ఉపాధ్యాయులు
చాలా రోజులుగా ఉమ్మడి జిల్లాలో అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో పలువురు కోరుకున్న స్థానాల్లో నేటికీ చేరలేదు. ఉపాధ్యాయుల కొరత ఉండడంతో బదిలీ జరిగిన ఉపాధ్యాయులనే వెనక్కి పంపించిన అధికారులు పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నారు. కొత్త ఉపాధ్యాయుల చేరికతో బదిలీ అయి రిలీవ్ కాలేని ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం లభించే అవకాశముంది.
శిక్షణ శిబిరాలు ఎక్కడంటే..
శిక్షణ శిబిరం సబ్జెక్టు సంఖ్య
ఎస్‌ఎస్‌పీ పాలిటెక్నిక్ కళాశాల, కొండగుంటూరు ఎస్జీటీ 300
రాజమహేంద్రి ఇంజినీరింగ్ కళాశాల, పిడింగొయ్యి ఎస్జీటీ 227
జీఎస్‌ఎల్ డెంటల్ కాలేజీ–1 జోన్–2 పీజీటీ 347
జీఎస్‌ఎల్ డెంటల్ కాలేజీ–2 ఎస్‌ఏ (సోషల్) 132
ఐఎస్‌టీఎస్ ఉమెన్ ఇంజినీరింగ్ కాలేజీ, రాజానగరం ఎస్‌ఏ (ఫిజికల్ ఎడ్యుకేషన్) 211
సాయిమాధవి ఇంజినీరింగ్ కాలేజీ, మల్లంపూడి, రాజానగరం ఎస్‌ఏ (లాంగ్వేజెస్) 236
బీవీసీ ఇంజినీరింగ్ కాలేజీ, ఎస్‌ఏ (మ్యాథ్స్, ఫిజిక్స్, బీఎస్) 245

శిక్షణకు వచ్చేసారు

శిక్షణకు వచ్చేసారు