
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నేడు నిరసన
కొత్తపేట: రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం అమలాపురంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి కొత్తపేటలో ఆయన మాట్లాడుతూ పేద, సామాన్య వర్గాలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి, కొన్ని కళాశాలలను ప్రారంభించిందన్నారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉండగా కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఈ చర్య పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని అన్నారు. దీనిని వ్యతిరేకరిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజే సుధాకర్‌బాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు మేరకు అమలాపురం ఈదరపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దీనికి జిల్లాలోని పార్టీ శ్రేణులు, యువత తరలిరావాలని డేవిడ్‌రాజు పిలుపునిచ్చారు.
లంకల్లో ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి
అమలాపురం రూరల్: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని, మంగళవారం రెండో ప్రమాద హెచ్చరికకు వరద నీరు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీంతో గోదావరి తీరం వెంబడి తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల కాజ్ వేలపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయని, బోట్ల సహకారంతో అత్యవసర పనులు ఉన్నవారిని మాత్రమే తరలించాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.