
రాళ్ల దాడిలో వ్యక్తి మృతి
రాయవరం: సరిహద్దు వివాదం నేపథ్యంలో జరిపిన రాళ్ల దాడిలో పలువురు వ్యక్తులు గాయపడగా, ఒకరు మృత్యువాత పడ్డారు. రాయవరం గ్రామంలో పోలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చేర్చి ఉన్న స్థలంలో పోలమ్మ ఆలయ కమిటీ రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టింది. దీన్ని ఆనుకుని ఉన్న ఇంటి యజమానికి, పోలమ్మ ఆలయ కమిటీకి కొంతకాలంగా వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం రేకు షెడ్డు నిర్మాణం జరుగుతుండగా, పక్కనే ఉన్న భవనంపై నుంచి రేలంగి నాగేశ్వరరావు, అతని కుటుంబ సభ్యులు రాళ్లదాడి చేసినట్లుగా పోలమ్మ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తొలుత కారం నీళ్లు చల్లడంతో పాటుగా ఒక్కసారి రాళ్లదాడి ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు. ఊహించని పరిణామానికి బిత్తరపోయిన కమిటీ సభ్యులు గాయాలపాలయ్యారు. ఇటుకరాళ్లతో చేసిన దాడిలో సుమారు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో బోదంకి సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు(51) రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. రాళ్లదాడిలో కసిరెడ్డి సత్యవతి, కె.నాగమణి, పూడి సత్తిబాబు, కొఠాని దుర్గాప్రసాద్, యాళ్ల సూర్యకుమారి, బలగం నాగమణి, కిల్లి గౌరి గాయపడ్డారు. ఘటనా స్థలంలో రామచంద్రపురం ఇన్‌చార్జి డీఎస్పీ ప్రసాద్ విచారణ నిర్వహించారు.
నిర్మాణ పనులు చేసుకుంటున్న వారిపై నాగేశ్వరరావు అతని కుటుంబ సభ్యులు రౌడీయిజం చేసి ఒకరి మృతికి కారణమయ్యారని, కఠినంగా శిక్షించాలని పోలమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు నౌడు వెంకటరమణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మృతుడు సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సురేష్‌బాబు తెలిపారు.

రాళ్ల దాడిలో వ్యక్తి మృతి