సర్కారీ చోద్యానికి సమ్మె వైద్యం
● సర్వీస్ కోటా అమలుపై
వైద్యుల్లో తీవ్ర అసంతృప్తి
● హక్కుల సాధనకు నేటి నుంచి
విధుల బహిష్కరణ
● ప్రభుత్వం దిగి రాకుంటే ఉద్యమం
ఉధృతం చేస్తామని హెచ్చరిక
ఆలమూరు: శరీరంలో రుగ్మతలు తలెత్తితే వైద్యులు తమ మేధా సంపత్తిని ఉపయోగించి మెరుగైన చికిత్స ద్వారా రోగిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దుతారు. అదే రీతిలో అస్తవ్యస్త నిర్ణయాలను తీసుకున్న పాలకులను దారిలో పెట్టాలంటే సమ్మె అనే చికిత్స అవసరమని రాష్ట్ర పీహెచ్‌సీ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీపీహెచ్‌సీడీఏ) భావిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగుల పట్ల అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టగా గ్రామ, వార్డు సచివాలయ, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది తమ హక్కుల సాధనపై పోరాడుతున్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లోను, ఉద్యోగుల్లోను తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా అందులో 47 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 07 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉన్నాయి. అందులో ప్రస్తుతం 97 మంది వైద్యులు పనిచేస్తుండగా ప్రతి రోజూ సుమారు ఐదు వేల మందికి చికిత్సను అందిస్తున్నారు. దీంతో పాటు చంద్రన్న సంచార చికిత్స, స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి నిత్యం నివేదికలను అందచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహించే పీహెచ్‌సీ వైద్యుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ పేద ప్రజల అభ్యున్నతి కోసం వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు. పీహెచ్‌సీలో కచ్చితంగా ఇద్దరు వైద్యులతో పాటు 14 మంది సిబ్బందిని నియమించి గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూపకల్పన చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించే చర్యలు తీసుకుంటూ పేద ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడిచే విధంగా నిర్ణయాలను తీసుకుంటోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో పోరుబాట పడితే క్లినికల్ విభాగంలోని సీట్లను 20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మళ్లీ ఈ ఏడాది పాత విధానమే అమలు చేస్తున్నానని చెప్పడం పీహెచ్‌సీ వైద్యుల ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో పాటు విష జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో పీహెచ్‌సీ వైద్యులు సమ్మె చేపట్టడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
రాష్ట్ర పీహెచ్‌సీడీఏ ఉద్యమ కార్యాచరణ
జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీ వైద్యులు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు రాష్ట్ర పీహెచ్‌సీడీఏ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసి అమలు దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే పీహెచ్‌సీ వైద్యులు ఈ నెల 26న ఆన్‌లైన్ రిపోర్టింగ్, అధికారిక పర్యటనలను నిలిపివేయగా 27న చంద్రన్న సంచార చికిత్స, స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్‌ను బహిష్కరించి కేవలం పీహెచ్‌సీలోని విధులకు పరిమితమయ్యారు. 28న ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగి నిరసనలు తెలియజేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో సోమవారం నుంచి పీహెచ్‌సీ విధులను బహిష్కరించి కేవలం అత్యవసర సేవలకు మాత్రమే పరిమితమవుతూ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న జిల్లా స్థాయిలో నిరసనలను తెలుపుతామని ప్రకటించారు. అమలాపురంలో పీహెచ్‌సీ వైద్యులందరూ అక్టోబర్ ఒకటో తేదీన భారీ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర పీహెచ్‌సీ డీఏ ఐక్యవేదిక పిలుపు మేరకు అక్టోబర్ రెండో తేదీన చలో విజయవాడకు తరలివెళ్లనున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే అక్టోబర్ మూడు నుంచి నిరవఽధిక నిరసన దీక్షలకు దిగుతామని ఐక్యవేదిక హెచ్చరించింది.
ప్రత్యామ్నాయ
ఏర్పాట్లు చేశాం
పీహెచ్‌సీ వైద్యుల సమ్మె నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వైద్యులతో చర్చలు జరుపుతున్న కారణంగా సమ్మె ఉండదని భావిస్తున్నాం. ఒకవేళ వైద్యులు విధులు బహిష్కరిస్తే మాత్రం పీహెచ్‌సీల్లోని మిగతా విభాగాల్లో పనిచేసే వైద్య ఆరోగ్య సిబ్బందితో పరిపూర్ణంగా సేవలను అందిస్తాం.
కె.దుర్గారావు దొర, జిల్లా వైద్య
ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్ బీఆర్
అంబేడ్కర్ కోనసీమ జిల్లా
పీహెచ్‌సీ వైద్యుల డిమాండ్లు ఇవీ..
ఇన్ సర్వీస్‌లోనున్న పీహెచ్‌సీ వైద్యులకు పీజీ సీట్ల కోటాను పునరుద్ధరించాలి.
కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఉన్న గడువును ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించాలి.
గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు బేసిక్‌పై 50 శాతం అదనంగా అలవెన్స్ ఇవ్వాలి.
చంద్రన్న సంచార చికిత్సలో పాల్గొనే వైద్యులకు రూ.ఐదు వేలు అలవెన్స్‌గా ఇవ్వాలి.
పీహెచ్‌సీ వైద్యులందరికీ సీహెచ్‌సీ వైద్యుల మాదిరిగానే మూడేళ్లకు పదోన్నతులు కల్పించాలి.
సర్కారీ చోద్యానికి సమ్మె వైద్యం


