మహిషాసుర మర్దినికి దండ వేసేందుకు వేలం | - | Sakshi
Sakshi News home page

మహిషాసుర మర్దినికి దండ వేసేందుకు వేలం

Sep 29 2025 8:20 AM | Updated on Sep 29 2025 8:20 AM

మహిషాసుర మర్దినికి దండ వేసేందుకు వేలం

మహిషాసుర మర్దినికి దండ వేసేందుకు వేలం

రూ.1.05 లక్షలకు పాడుకున్న వైనం

అమలాపురం టౌన్‌: స్థానికంగా జరిగే ఏడు వీధుల దసరా ఉత్సవాల్లో ఒకటైన రవణం వీధి వాహనం మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో వేసే తొలి పూల దండకు ఏటా వేలం పాట నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే రవణం వీధిలోని మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం వద్ద దండకు ఆ వీధి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆదివారం వేలం పాట నిర్వహించారు. అమలాపురానికి చెందిన ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిర పడ్డ ఆకుల లక్ష్మణరావు కుటుంబం దండను రూ.1.05 లక్షలకు పాడుకున్నారు. ఈ దండనే అక్టోబర్‌ రెండో తేదీన జరిగే రవణం వీధి దసరా ఉత్సవాలు, ఊరేగింపు వేళ అమ్మవారి మెడలో లక్ష్మణరావు కుటుంబీకులు వేయనున్నారు. ఇదే ఆకుల లక్ష్మణరావు గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో నిర్వహించిన వేలం పాటలో అమ్మవారి దండను రూ.1.03 లక్షలకు పాడుకున్నారు.

గణపతి ఆలయానికి భక్తుల తాకిడి

అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు. మహా నివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 59 మంది పాల్గొన్నారు. 12 మంది భక్తులు ఉండ్రాళ్ల పూజ జరిపారు. స్వామివారి పంచామృతాభిషేకాల్లో రెండు జంటలు పాల్గొన్నాయి. నలుగురికి అక్షరాభ్యాసాలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీగణపతి హోమంలో 27 జంటలు పాల్గొనగా, నలుగురు చిన్నారులకు తులాభారం నిర్వహించారు. స్వామికి ఏడుగురు భక్తులు తలనీలాలు సమర్పించారు. 55 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,120 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,50,947 ఆదాయం లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

లోపభూయిష్టంగా మెగా డీఎస్సీ

– న్యాయ పోరాటం చేస్తాం

అమలాపురం రూరల్‌: ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ లోపభూయిష్టంగా జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా సెలక్షన్‌ కమిటీ మెరిట్లో వచ్చిన ఎస్సీ అభ్యర్థులకు రిజర్వేషన్‌లో అన్యాయం జరిగిందని ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్‌ అన్నారు. అమలాపురం బుద్ధవిహార్‌లో ఆదివారం డీఎస్సీ అభ్యర్థుల సమావేశం గోసంగి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఎస్సీ, ఎస్టీలను ఓపెన్‌ కేటగిరిలోనికి తీసుకోకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. 50శాతం ఉద్యోగాలను కులాలకు అతీతంగా ఓపెన్‌ కేటగిరిలో భర్తీ చేయవలసి ఉందని కానీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సంపాదించినా వారిని రిజర్వుడు కేటగిరిలోనే పరిగణనలోకి తీసుకొని అన్యాయం చేశారని సమావేశం తెల్పింది. బీసీ అభ్యర్థులు వారి రిజర్వేషన్లలో సెలక్ట్‌ అయిన అభ్యర్థులను ఓపెన్‌ కేటగిరిలో చూపించారని అన్నారు. ఈ సమావేశంలో ములపర్తి సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌, కాశీ వెంకటేశ్వరరావు, ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు చిలకపాటి సాంబశివరావు పాల్గొన్నారు.

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాల

ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

కొత్తపేట: కోనసీమ తిరుమలగా, భక్తుల కోర్కెలు తీర్చే ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 10వ తేదీ నుంచి 18 వరకూ జరగనున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆదివారం సాయంత్రం దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీ అండ్‌ ఈఓ చక్రధరరావు మాట్లాడుతూ 9 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు, సేవలు, స్వామివారి ఊరేగింపుల గురించి వివరించారు. వేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్‌, రూ 20 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement