పోస్టులు ఖాళీ.. పని భారీ.. | - | Sakshi
Sakshi News home page

పోస్టులు ఖాళీ.. పని భారీ..

Sep 26 2025 6:38 AM | Updated on Sep 26 2025 6:40 AM

రాయవరం మండలం కురకాళ్లపల్లిలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఒక కేంద్రంలో వర్కర్‌, హెల్పర్‌ కూడా లేరు. మరో కేంద్రంలో హెల్పర్‌ లేరు. వీటిని ఓ అంగన్‌వాడీ కార్యకర్త నిర్వహిస్తోంది. ఆ రెండింటినీ ఆమె ఒక్కరే ఎలా సమర్థవంతంగా నిర్వహించగలరన్నది ప్రశ్నార్థకం. జిల్లాలో మరిన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది.

రాయవరం: ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి ఒక టీచర్‌, ఒక ఆయా ఉండాలి. టీచర్‌ ప్రతి రోజు చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలి. అదే సమయంలో చిన్నారులకు పౌష్టికాహారంగా గుడ్డు, పాలు, ఆకుకూరలతో కూడిన భోజనం అందిస్తారు. అలాగే గర్భిణులు, బాలింతలకు టీహెచ్‌ఆర్‌ (టేక్‌ హోమ్‌ రేషన్‌)మొదటి విడత, రెండో విడతల్లో పౌష్టికాహారం అందజేస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఈ కార్యక్రమాలేవీ సక్రమంగా జరగడం లేదు.

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. దీంతో కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏటా కోట్లాది రూపాయలు

ఏటా చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీల ద్వారా పోషకాహారం, టీకాలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నాయి. వీటితో పాటు వివిధ పరికరాల సామగ్రి అందిస్తున్నాయి. చాలా కేంద్రాల్లో టీచర్‌, ఆయా పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదన్న విమర్శలున్నాయి.

ఎదురుచూస్తున్న నిరుద్యోగులు

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌, ఆయా పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారా అని నిరుద్యోగ యువతులు ఎదురు చూస్తున్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారా అని వారు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇదీ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 22 మండలాలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,726 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 7,725 మంది గర్భిణులు, 5,848 మంది బాలింతలు, ఆరు నెలల లోపు చిన్నారులు 901 మంది, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 7,017 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో మొత్తం 18 అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలున్నాయి. వీటిలో న్యాయస్థానం పరిధిలో మూడు పోస్టులు ఉండగా, మరో తొమ్మిది పోస్టులు పదోన్నతుల్లో భాగంగా భర్తీ చేయాల్సి ఉంది. ఆరు పోస్టులు క్లియర్‌ వేకెన్సీ ఉన్నాయి. అలాగే జిల్లాలో 77 అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్మెంట్‌ వయస్సు 62 సంవత్సరాలుగా ఉండడంతో త్వరలో కానున్న పదవీ విరమణలతో మరిన్ని ఖాళీలు వచ్చే అవకాశం ఉంది.

ఇబ్బందులివీ

● పూర్తి స్థాయిలో సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రంలో లేకపోవడం వల్ల సమర్ధవంతంగా చిన్నారులకు విద్యను అందించలేక పోతున్నారు.

● అలాగే పౌష్టికాహారాన్ని అందించడం కష్టసాధ్యంగా మారుతోంది.

● ఆరోగ్యవంతమైన సమాజానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

● అంగన్‌వాడీ కార్యకర్తలపై పనిభారం అధికమవుతోంది.

● ప్రీ స్కూల్‌ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.

● సెలవులు పెట్టుకునే అవకాశాలున్నా, ఆ హక్కును సిబ్బంది కోల్పోతున్నారు.

సమర్ధ నిర్వహణ ఎలా?

అంగన్‌వాడీ కేంద్రం సమర్ధవంతంగా నిర్వహించాలంటే కచ్చితంగా అంగన్‌వాడీ వర్కర్‌, హెల్పర్‌ ఉండాలి. కాని జిల్లాలో ఏళ్ల తరబడి వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హులైన హెల్పర్లకు పదోన్నతులు ఇచ్చి తక్షణమే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. టీచర్‌ పోస్టులు ఖాళీలు ఉన్న చోట హెల్పర్లకు పదోన్నతులు కల్పించాలి.

– కె.కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి,

అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌

యూనియన్‌, డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా

ఉత్తర్వులు అందిన వెంటనే

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌, ఆయా పోస్టుల భర్తీకి ఉత్తర్వులు అందిన వెంటనే భర్తీకి చర్యలు చేపడతాం. ప్రస్తుతం సిబ్బంది కొరత వేధిస్తోంది. చిన్నారులకు, బాలింతలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.

– వై.విజయశ్రీ, పీఓ,

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా

అంగన్‌వాడీ చిన్నారులకు బోధన చేస్తున్న టీచర్‌

అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత

గర్భిణులకు, బాలింతలకు

అందని పోషకాహారం

చిన్నారులకు అందని ప్రాధమిక విద్య

జిల్లాలో 18 టీచర్లు..

77 ఆయా పోస్టులు ఖాళీ

వేరే కేంద్రాల టీచర్లకు అదనపు బాధ్యతలు

పని భారంతో తప్పని సిబ్బంది అవస్థలు

రెండు కేంద్రాలకు ఒకే కార్యకర్త

పోస్టులు ఖాళీ.. పని భారీ..1
1/3

పోస్టులు ఖాళీ.. పని భారీ..

పోస్టులు ఖాళీ.. పని భారీ..2
2/3

పోస్టులు ఖాళీ.. పని భారీ..

పోస్టులు ఖాళీ.. పని భారీ..3
3/3

పోస్టులు ఖాళీ.. పని భారీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement