నేరం వారిది.. శిక్ష వీరికి.. | - | Sakshi
Sakshi News home page

నేరం వారిది.. శిక్ష వీరికి..

Sep 26 2025 6:38 AM | Updated on Sep 26 2025 6:38 AM

నేరం వారిది.. శిక్ష వీరికి..

నేరం వారిది.. శిక్ష వీరికి..

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ అండదండ లుంటే చాలు తిమ్మిని బమ్మిని చేసేయవచ్చని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్టున్నారు. అక్రమాలకు పాల్పడినా ఇట్టే తప్పించేసుకుని, చిరుద్యోగులను బలి చేసేయవచ్చని అనుకుంటున్నారేమో! నేరం ఒకరిది.. శిక్ష మరొకరికి అన్న చందంగా.. యూరియా సరఫరాలో చేతివాటం చూపుతూ కింది స్థాయి సిబ్బందిని బలి చే స్తున్నారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలోని ప్రాథ మిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్‌)లో తాజాగా ఇటువంటి ఉదంతం చోటు చేసుకుంది. ఇటీవల జిల్లాలో సంచలనం రేపిన చేబ్రోలు యూ రియా బాగోతాన్ని తలదన్నేలా ఒమ్మంగి పీఏసీఎస్‌లో తెలుగు తమ్ముళ్లు యూరియా దోపిడీకి తెగబడ్డారు.

ఏం జరిగిందంటే..

ఒమ్మంగి సొసైటీకి రెండు విడతల్లో 90 టన్నుల యూరియా వచ్చింది. రెండో విడత వచ్చిన యూరియాలో ఆ సొసైటీకి చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేత ప్రోద్బలంతో సుమారు 170 బస్తాలను ఆ పార్టీ సానుభూతిపరులకు దోచి పెట్టేశారు. ఎకరం ఉన్నా, ఐదెకరాలున్నా ఆధార్‌ కార్డు చూసి ఒకటి రెండు యూరియా బస్తాలు ఇవ్వడమే గగనమైన తరుణంలో.. అధికారం అండ, అడిగేవారెవరున్నారనే తెగింపుతో ఏకంగా 170 బస్తాల యూరియాను పక్కదారి పట్టించేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వ్యవసాయ శాఖ కమిషనర్‌ దీనిపై విచారణకు ఆదేశించారు. ఆ మేరకు ఒమ్మంగి సొసైటీలో వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టి నలుగురు అధిక మొత్తంలో యూరియా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఒకరు 50, మరో ముగ్గురు 40 మొత్తంగా 90 యూరియా బస్తాలు కొన్నట్టు గుర్తించారు. పీఏసీఎస్‌ అటెండర్‌ రామకుర్తి వంశీ, సొసైటీ చిరుద్యోగి సుంకర గంగాధర రామారావుతో పాటు మరో ఇద్దరు బయటి వారు కలిసి వాటిని తీసుకున్నట్టు తేల్చారు.

అసలైన పెద్దలను తప్పించి..

యూరియాను పక్కదారి పట్టించిన నలుగురిలో ఇద్దరు అదే సొసైటీ చిరుద్యోగులని చెప్పడం సందేహాలకు తావిస్తోంది. విషయం బయట పడటంతో అధికార పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి, ఈ సంఘటనను మసి పూసి మారేడు కాయ చందంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కోటాకు మించి బస్తాలను తరలించుకుపోయిన పెద్దలను తప్పించి చిరుద్యోగులను బలి చేశారని రైతులు తూర్పార పడుతున్నారు. ఒమ్మంగి సొసైటీ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఉన్న ఇద్దరు టీడీపీ కీలక నేతలు కనుసన్నల్లోనే ఈ తంతు సాగిందని అంటున్నారు. ఒకేసారి యూరియా భారీగా వచ్చిన నేపథ్యంలో దీని విక్రయాలు క్రమపద్ధతిలో జరపలేని గందరగోళంలో ఎవరెంత తీసుకువెళుతున్నారో తెలియలేదని మరో కట్టుకథ అల్లారంటున్నారు.

ఇతరుల పేరిట దోపిడీ!

మొత్తం 170 బస్తాల యూరియాను దారి మళ్లించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నేతలు ఇదే సొసైటీలో మరో పెద్ద కుంభకోణానికి కూడా పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని పలువురి ఆధార్‌ కార్డులు సేకరించి, వారి పేరున పెద్ద ఎత్తున యూరియా దోచేసినట్టు బయటపడింది. అధికారులు గుర్తించిన దాని కంటే రెండుమూడు రెట్లు అధికంగా యూరియాను తెలుగు తమ్ముళ్లు దారి మళ్లించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సొసైటీలో బస్తా రూ.266కు కొనుగోలు చేసి బ్లాక్‌లో రూ.350 నుంచి రూ.400కు అమ్మి వారు సొమ్ములు వెనకేసుకున్నారనే విషయం ఒమ్మంగిలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

‘తమ్ముళ్ల’ యూరియా దోపిడీ

ఒమ్మంగి సొసైటీలో

వెలుగు చూసిన బాగోతం

170 బస్తాలు పక్కదారి

ఇద్దరు నేతల క్రియాశీలక పాత్ర

చిరుద్యోగులను బలి చేసే యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement