
శిథిల వంతెన నిర్మాణాలకు అంచనాలు
కలెక్టర్ మహేష్ కుమార్
సాక్షి, అమలాపురం: రానున్న పుష్కరాల నాటికి జిల్లాలోని పురాతన, శిథిలావస్థకు చేరిన వంతెనల పునర్నిర్మాణాలకు అంచనాలు రూపొందించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆ శాఖ ఇంజినీర్లతో శాఖాపరమైన పథకాల అమల్లో పురోగతి, పెండింగ్ ప్రతిపాదనలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓఎన్‌జీసీ భారీ వాహనాలు రాకపోకలు సాగించే రహదారులకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులు, మరమ్మతులపై ఆరా తీశారు. ధాన్యం, ఆక్వా రంగ కార్యకలాపాలు, ఇసుక రవాణా సాగించే రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేయాలన్నారు. ఈదరపల్లి నూతన వంతెన వద్ద జంక్షన్ సుందరీకరణ పనులు అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా రోడ్ల నిర్మాణ పనుల మ్యాపింగ్, రహదారుల ప్రతిపాద నలకు త్వరగా నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలన్నారు. లొల్ల–ఆత్రేయపురం రహదారి నిర్మాణ పనులను పుష్కర పనుల ప్రతిపాదనలలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్‌ఈ బి.రాము, డివిజనల్, అసిస్టెంట్ ఇంజినీర్లు, టెక్నికల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జీఎస్టీ ప్రయోజనాలపై అవగాహన
ఈనెల 22 నుంచి అమలవుతున్న జీఎస్పీ ప్రయోజనాలపై వినియోగదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్, జీఎస్టీ 2.0 సంస్కరణల కోనసీమ నోడల్ జిల్లా అధికారి సీహెహచ్ రవికుమార్‌తో సమీక్షించారు. అత్యవసర వస్తువులపై పన్నులు గణనీయంగా తగ్గాయని, వ్యవసాయ యంత్రాలు, జన ఆరోగ్య సేవలు, విద్యా సేవలకు తక్కువ జీఎస్టీ వర్తింపజేశారని కలెక్టర్ పేర్కొన్నారు. గృహోపకరణాలపైనా జీఎస్టీ తగ్గించారని, ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై పూర్తి మినహాయింపు ఇచ్చారన్నారు. జిల్లా స్థాయిలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ మార్పులపై పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాలో వ్యవసాయం, ఉద్యాన రంగాలలో ఈ అంశంపై మరింత అవగాహన పెంచాలన్నారు. అత్యవసర ఔషధాలపై జీఎస్టీ జీరోగా నిర్ణయించారన్నారు. వ్యాపారులు జారీ చేస్తున్న బిల్లులను పరిశీలించి జీఎస్టీ తగ్గించినదీ, లేనిదీ పర్యవేక్షించాలన్నారు. కార్య క్రమంలో జేసీ టి.నిశాంతి, డీఎస్‌వో అడపా ఉదయభాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళిక
జిల్లాలో అతి పురాతనమైన దేవాలయాలను టెంపుల్ సర్క్యూట్ టూరిజం ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి టూరిజం కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంతర్వేది అయినవిల్లి, అప్పనపల్లి, వాడపల్లి, మురమళ్లలకు మాస్టర్ ప్లాన్ రూపొందించి టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అంతర్వేది లైట్ హౌస్ దగ్గర పర్యాటక శాఖకు 9 ఎకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు. లొల్ల లాకులు వద్ద జల వనరుల శాఖకు చెందిన 6.7 ఎకరాలు, వాడపల్లి వద్ద దేవాలయ భూమి 3.10 ఎకరాలు ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, జిల్లా టూరిజం అధికారి అన్వర్, డీఆర్‌డీఏ పీడీ గాంధీ జలవనరుల శాఖ ఈఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.