
ఎయిడ్స్ నియంత్రణకు మరిన్ని చర్యలు
అమలాపురం టౌన్: ఎయిడ్స్ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్ సీహెచ్ భరతలక్ష్మి వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేస్తూ జిల్లాలో ఆ వ్యాధికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లాలో చేపట్టిన హెచ్‌ఐవీ నియంత్రణ చర్యలపై గురువారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చి నిర్దేశిత లక్ష్యాలపై సమీక్షించారు. ఏఆర్టీ సేవలు హెచ్‌ఐవీ రోగులకు సజావుగా అందాలన్నారు. గర్భిణులకు సరైన చికిత్స అందించడం ద్వారా పిల్లలకు హెచ్‌ఐవీ రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి.బాలాజీ, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఎ.బుజ్జిబాబు, జిల్లా మానటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫీసర్ ఎంవీ రతన్‌రాజుతో పాటు డీఎస్‌ఆర్‌సీ ఏఆర్‌టీలు, ఎన్‌జీవోలు పాల్గొన్నారు.
వీఆర్‌కు సోషల్ మీడియా సీఐ
అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం సీఐగా పనిచేస్తున్న జి.వెంకటేశ్వరరావుపై వీఆర్ వేటు పడింది. ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయం ఆదేశాల మేరకు ఎస్పీ రాహుల్ మీనా గురువారం ఆయనకు రిలీవ్ ఆర్డర్లు ఇచ్చారు. దాదాపు 15 ఏళ్లుగా జిల్లాలో పనిచేస్తున్నారన్న అభియోగంపై ఆయనను వీఆర్‌కు పంపించినట్లు తెలిసింది. కాగా ఎస్పీ కార్యాలయంలో రెండు జిల్లా పోలీస్ విభాగాలను పర్యవేక్షిస్తున్న ఇద్దరు సీఐలలో ఒకరిని పొరుగు జిల్లాకు బదిలీ చేసేందుకు, మరో సీఐని వీఆర్‌కు పంపించేందుకు నిర్ణయం జరిగినప్పటికీ అమలాపురంలో జర గనున్న దసరా ఉత్సవాలు, ఊరేగింపుల వల్ల వారి బదిలీలకు తాత్కాలికంగా బ్రేకులు పడినట్లు తెలిపింది. దసరా తర్వాత వీరి బదిలీ జరిగే అవకాశం ఉందని సమాచారం.
కొత్తపేట స్టేషన్‌లో ఎస్పీ తనిఖీ
కొత్తపేట: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టాక క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ పోలీస్ స్టేషన్లను సందర్శిస్తూ కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలిస్తున్నారు. దానిలో భాగంగా కొత్తపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. వస్తూనే స్టేషన్ ఆవరణ, లోపల విభాగాలు, సెల్, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ స్థితిగతులు, కేసులపై ఎస్సై జి.సురేంద్రను ఆరా తీశారు. పలు అంశాలపై ఆయన సిబ్బందితో సమీక్షించారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడేదిలేదన్నారు. అందరూ అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ముందస్తు సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు తెలియచేయాలని ఆదేశించారు.
న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్‌కృష్ణ కోరారు. సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య వేదిక ఆధ్వర్యాన వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆందోళన ఉధృతం చేయనున్నారు. దీనికి సంబంధించి రాజమహేంద్రవరంలోని సచివాలయ ఉద్యోగుల కార్యాచరణపై స్థానిక 48వ డివిజన్ సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎయిడ్స్ నియంత్రణకు మరిన్ని చర్యలు