
పరిశుభ్రత సామాజిక బాధ్యత
అమలాపురం రూరల్: పరిశుభ్రత అనేది సామాజిక బాధ్యత కావాలని, నిరంతర ప్రక్రియగా శ్రమదానం చేయాలని కలెక్టర్ రావిరాల మహేష్‌కుమార్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హి సేవ సందర్భంగా పట్టణంలోని సర్క్యులర్ బజార్ ప్రాంగణంలో ‘ఒక రోజు, ఒక గంట, ఒకేసారి’ నినాదంతో గురువారం నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయనతో పాటు జేసీ టి.నిశాంతి, ఆర్డీవో కొత్త మాధవి, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్‌కుమార్ తదితరులు గంట సమయం పాటు శ్రమదానం చేసి చెత్తను తొలగించారు. కలెక్టర్, జేసీ, డీఆర్వోలు స్వయంగా చీపురు, పలుగు పట్టుకుని చెత్త తొలగించారు. తొలుత సర్క్యులర్ బజార్ ప్రాంగణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్, వార్డు సచివాలయాలు, మెప్మా విభాగాల మహిళా ఉద్యోగులు తీర్చిదిద్దిన స్వచ్ఛత రంగోలీని అధికారులు పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం కలెక్టర్ వారిచే స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. జేసీ, ఆర్డీవోలు మాట్లాడుతూ పరిసరాల పరిశభ్రతకు ప్రజల నిత్యం శ్రమదానాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రమదానంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, మెప్మా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.