
మంత్రి గారి ఆదేశాలు.. దివ్యాంగులకు అగచాట్లు
రామచంద్రపురం రూరల్: మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలతో నెల రోజులుగా రామచంద్రపురం ఎంఈఓ కార్యాలయం తాళాలు వేసి దర్శనమిస్తోంది. రెండంతస్తుల భవనంలో పైన ఎంఈఓ కార్యాలయం ఉండగా, కింద దివ్యాంగ విద్యార్థుల భవిత కేంద్రం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద మహిళలకు కుట్టు మెషీన్ల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు ఎంఈఓ కార్యాలయంలో గత ఏప్రిల్‌లో ప్రారంభించారు. నెల రోజుల క్రితం శిక్షణ పూర్తయినా, కార్యాలయంలో కుట్టు మెషీన్లు ఉండిపోవడంతో మీటింగ్ హాల్‌ను ఇంకా ఎంఈఓకు అప్పగించలేదు. శిక్షణకు వచ్చే మహిళలకు మరుగుదొడ్లకు ఇబ్బంది అవుతుందని ఎంఈఓ ఆఫీసును కింద ఉన్న దివ్యాంగుల భవిత పాఠశాలలోకి మార్చేశారు. దీంతో దివ్యాంగ చిన్నారులకు ఫిజియోథెరపీని ఆరుబయట వరండాలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి తీరుతో దివ్యాంగ చిన్నారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికై నా మంత్రి తన తప్పును సరిదిద్దుకుని ఎంఈఓ కార్యాలయాన్ని పై అంతస్తులోకి తరలించాలని, భవిత కేంద్రాన్ని దివ్యాంగ చిన్నారులకు పూర్తి స్థాయిలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫ నెల రోజులుగా
ఎంఈఓ ఆఫీస్‌కు తాళం
ఫ చిన్నారులకు వరండాలో ఫిజియోథెరపీ