
తడబడిన అడుగు
సాక్షి, అమలాపురం: ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి వసతుల కల్పించాలనే ఆశయం నీరుగారి పోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు జరిగేలా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనను పక్కన పెట్టిందనే విమర్శలకు నాడు–నేడు ఒక ఉదాహరణ. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా ఆధునీకరించగా కూటమి ప్రభుత్వం నాడు– నేడును ఆటకెక్కిస్తోంది.
నాడు పాఠశాలలకు మహర్దశ
శిథిలావస్థకు చేరి కనీసం విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు సైతం వీలు లేని పాఠశాలలను నాడు– నేడులో మహర్దశ కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యను పలు రకాలుగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. అమ్మఒడి, ప్రతి రోజు ఒక కోడిగుడ్డుతో మెరుగైన నాణ్యతతో కూడిన భోజనం, యూనిఫామ్, బూట్లు, పాఠ్య పుస్తకాలు, ట్యాబ్‌లు, ఇంగ్లిష్ మీడియం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విప్లవాత్మక చర్యలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా నాడు–నేడులో పాఠశాలలో మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో కోనసీమ జిల్లాలో 451 పాఠశాలలను నాడు–నేడుకు ఎంపిక చేసింది. వీటి అభివృద్ధికి రూ.92 కోట్లు కేటాయించింది. దీనిలో రెండు పాఠశాలలలో పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన పాఠశాలలకు సంబంధించి 433 పాఠశాలల్లో పనులు పూర్తికాగా 16 చోట్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. కేటాయించిన నిధుల కన్నా అదనంగా రూ.92.12 కోట్లు ఖర్చు చేశారు. ఇక రెండవ దశకు సంబంధించి 763 పాఠశాలలను నాడు –నేడుకు ఎంపిక చేశారు. ఇందుకు రూ.249.29 కోట్లు కేటాయించారు. రెండు పాఠశాలల్లో పనులు మొదలు కాలేదు. 117 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. 644 పాఠశాలల్లో పనులు మొదలై వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం రూ.115.51 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ పనుల్లో 90 శాతం గత ప్రభుత్వ హయాంలోనే జరగడం గమనార్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు దాదాపు నిలిచిపోయాయి. జిల్లాలో నాడు– నేడు రెండు దశల్లో కలిపి 1,214 పాఠశాలలు ఎంపిక కాగా ఇప్పటి వరకు 550 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన 660 పాఠశాలల్లో పనులు పూర్తి కాకపోవడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వెనుక విద్యను మరింత ప్రైవేటీకరించాలని ఆలోచన ఉందనే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో
నిలిచిపోయిన నాడు–నేడు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రెండవ దశలో 763
నిర్మాణాలకు అనుమతి
రూ.249.25 కోట్ల కేటాయింపు
గత ప్రభుత్వ హయాంలోనే 644 పనులు ప్రారంభం
వీటిలో 117 పూర్తి..
రూ.115.51 కోట్ల ఖర్చు
కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు నిలిచిపోయిన పనులు
అసంపూర్తి నిర్మాణాలతో
నెరవేరని లక్ష్యం
కొసరు పనులు గాలికి..
మలికిపురం మండలం ఇరుసుమండ జెడ్పీ ఉన్నత పాఠశాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మొత్తం రూ.64 లక్షలు కేటాయించగా రూ.32లక్షల వరకు ఖర్చు చేశారు. మరో రూ.32 లక్షల పనులు జరగాల్సి ఉంది. తరగతి గదులకు సంబంధించి శ్లాబ్‌లు వేశారు, గోడలు కట్టారు. కాని తలుపులు, విద్యుత్ వంటి పనులు జరగలేదు. పనులు నిలిచిపోవడంతో ఈ భవనం నిరుపయోగంగా మారింది.
పునాదుల్లోనే..
అంబాజీపేట మండలం కె.పెదపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించ తలపెట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పరిస్థితి ఇది. మూడు అదనపు తరగతులను నిర్మించేందుకు రూ.39 లక్షలు మంజూరు చేశారు. కేవలం బేస్‌మెంట్ వరకు నిర్మించి వదిలేశారు. 2022లో మంజూరైన నిధులతో చేపట్టిన ఈ పనులు గత ప్రభుత్వ హయాంలో జరగగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయాయి.

తడబడిన అడుగు

తడబడిన అడుగు