
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మలికిపురం: ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంత మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ జయచంద్ర గాంధీ సూచించారు. మంగళవారం మలికిపురం వెలుగు కార్యాలయంలో డీఆర్‌డీఏ, జిల్లా చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మహిళల శిక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బ్యాంకులు, సీ్త్ర నిధి బ్యాంకు ద్వారా అనేక రుణాలను ఇస్తూ ప్రోత్సాహం అందిస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళ ఆర్థిక స్వావలంబన సాధిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుందన్నారు. రుణాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు. జిల్లా చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆహార ప్రోసెసింగ్ పరిశ్రమలకు సబ్సిడీ అధికంగా ఉంటుందన్నారు. మన ప్రాంతంలో లభించే కొబ్బరి, జీడిపప్పు, పండ్ల తోటల ద్వారా ఆహార ప్రోసెసింగ్ పరిశ్రమలు స్థాపించుకోవాలని సూచించారు. అవసరం తెలిస్తే ఆలోచన వచ్చి ఉపాధికి అవకాశం లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు స్కీమ్‌ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. సదస్సులో పాల్గొన్న ఇండస్ట్రీస్ జిల్లా ఎండీ పి.శివరామప్రసాద్ మాట్లాడుతూ మహిళలు వివిధ పథకాలను వినియోగించుకునే విధంగా ఉద్యం ఆధార్ ఉచిత రిజిస్ట్రేషన్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జెడ్పీటీసీ బల్ల ప్రసన్న కుమారి, ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు దివ్వి దుర్గాభవాని, కమిడి దివ్య, దళం అశ్వని, ఏపీఎం సయీద్ పాల్గొన్నారు.