
వైఎస్సార్ సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలి
అమలాపురం టౌన్: అత్యధిక ఓటు శాతం ఉన్న వైఎస్సార్ సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించి మాట్లాడే సమయాన్ని కేటాయించవచ్చని నిబంధనలు చెబుతున్నాయని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ అన్నారు. అమలాపురంలో ఆయన మంగళవారం స్థానిక మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పదే పదే చెప్పే స్పీకర్ వాటిని అమలు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. అధిక ఓటింగ్ శాతం ఉన్న వైఎస్సార్ సీపీకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ప్రశ్నించే గొంతుకను నొక్కేయడమేనని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు బిజినెస్ కమిటీ, రూల్స్ కమిటీలతో స్పీకర్ ఈ విషయమై చర్చించాల్సి ఉండగా ఏకపక్ష నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అసెంబ్లీకి రాకుండా చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి ఆదాయ మార్గాల అన్వేషణలో ఉందన్నారు. నేడు ప్రభుత్వ వైద్య కశాశాలలను, గ్రానైట్ క్వారీస్‌ను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేస్తూ ఆదాయ వనరులు పెంచుకుంటోందని విమర్శించారు. పేద కుటుంబాల విద్యార్థులను ప్రభుత్వ వైద్య విద్యకు దూరమయ్యేలా చేసిన పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కిషోర్ డిమాండ్ చేశారు.
పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి కిషోర్