
ప్రాణం తీసిన అతివేగం
● పెదవలసలలో ఎదురెదురుగా బైక్‌లు ఢీ
● ఇద్దరు యువకుల మృతి–మరొకరికి
తీవ్ర గాయాలు
● సావిత్రినగర్‌లో విషాదం
తాళ్లరేవు: అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకోగా, మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీ పెదవలసల గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొక యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సావిత్రినగర్‌కు చెందిన మచ్చా లక్ష్మీ సతీష్ (20), పాలెపు కాసురాజు (21)లు స్పోర్ట్స్ బైక్‌లపై అతివేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో లక్ష్మీ సతీష్, కాసురాజు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్‌పై వెనుక కూర్చున్న సావిత్రినగర్ గ్రామానికి చెందిన మరొక యువకుడు ఇళ్లంగి మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మణికంఠను తాళ్లరేవు సామాజిక ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కోరంగి పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఇలా ఉండగా రోడ్డుపై అకస్మాత్తుగా పెద్ద శబ్ధం వచ్చిందని వచ్చి చూడగా ఘటనా స్థలంలో యువకులు మృతి చెంది ఉన్నారని స్థానికులు తెలిపారు.
కుటుంబ సభ్యుల రోదన
పెదవలసల గ్రామంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకులతోపాటు తీవ్రంగా గాయపడ్డ యువకుడు కూడా యానాం సావిత్రినగర్ గ్రామానికి చెందినవాడు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధిక సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది.

ప్రాణం తీసిన అతివేగం