
స్వచ్ఛతే మన లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నాగయ్య కళా క్షేత్రంలో జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత, పరిశుభ్రత పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్వచ్ఛత కార్యక్రమంలో స్వచ్ఛత కార్పొరేషన్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 7 అవార్డులు, జిల్లా స్థాయిలో 55 అవార్డులు అందజేసినట్టు వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులను కై వసం చేసుకునేలా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ 2026 నాటికి జిల్లాకు 100 స్వచ్ఛత అవార్డులు తెప్పించాలన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేతుల మీదుగా జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డులను అందజేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత, డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి త దితరులు పాల్గొన్నారు.