చిత్తూరు రూరల్(కాణిపాకం): ఏపీపీహెచ్‌సీడీఏ సంఘం పిలుపు మేరకు జిల్లాలోని పీహెచ్‌సీ వైద్యులు సమ్మెను కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా విధులను బహిష్కరించారు. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు నల్ల రిబ్బన్ ధరించి.. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సంఘ నాయకులు ఎల్లయ్య, శిరీష మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె ఆగదన్నారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్ సర్వీస్ పీజీ కోటా విషయంలో తగ్గేదేలేదన్నారు.
పీహెచ్‌సీలు వెలవెల
సమ్మె కారణంగా పీహెచ్‌సీలు వెలవెలబోతున్నాయి. వైద్యులు సమ్మె బాట పట్టారని తెలిసి పల్లెల్లోని జనం పట్టణ బాట పడుతున్నారు. కేవలం మందులు, మాత్రల కోసమే పీహెచ్‌సీలకు వస్తున్నారు. చికిత్స కోసం ఆర్‌ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పీహెసీల్లో ఓపీ సేవలు పూర్తిగా స్తంభించాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మూలనపడ్డాయి. ఆన్‌లైన్ సేవలు ఆమాడ దూ రంలో పడిపోయాయి. పల్లెల్లో విష జ్వరాలు కోరలు చాస్తున్నాయి. సమ్మె మరిన్ని రోజులు కొనసాగితే పరిస్థితులు చేయిదాటిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.