
దర్జాగా దోషులు.. నిర్దోషులకు వేధింపులు
కార్వేటినగరం : అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో దోషులను దర్జాగా వదిలేసి, నిర్దోషులను వేధిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. ఆదివారం పుత్తూరు లోని తన నివాసంతో మీడియాతో మాట్లాడారు. దళితులపై కక్షగట్టి అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితుడిని ప్రభుత్వం వదిలేసిందని ఆరోపించారు. దేవళంపేటలో రాజ్యాంగ నిర్మాత విగ్ర హం నెలకొల్పిన సర్పంచ్ గోవిందయ్యను మాత్రం అరెస్ట్ చేయించిందని విమర్శించారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఎలా కస్టడీలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. గ్రామంలో అంబేడ్కర్ విగ్ర హం పెట్టినప్పటి నుంచి గొడవ చేస్తున్న టీడీపీ నేత సతీష్‌నాయుడుని వదిలిపెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీష్‌నాయుడు పలుమార్లు విగ్రహం తొలగించేందుకు యత్నించాడని ఆరోపించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను వెలికితీయాల్సిన పోలీసులు సైతం కూటమి ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులను సైతం దోషులుగా నిలబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. విగ్రహానికి నిప్పు పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయని, అయితే పోలీసులు అలాంటివి లేవని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈక్రమంలోనే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిర్దోషికి శిక్ష పడకూడదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి తానే నిప్పు పెట్టానని ఒప్పుకోవాలని ఓ మహిళను బలవంతం చేస్తున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. అభం శుభం తెలియని అమాయకులపై కేసులు పెట్టడం సరికాదని, నిజమైన దోషిని గుర్తించి రాజకీయాలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేఽశారు. వైఎస్సార్‌సీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, పార్టీ లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్ పాల్గొన్నారు.