
వసతి పర్యవేక్షీణం
మొక్కుబడిగా సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణ గాడి తప్పిన వసతిగృహాల నిర్వహణ సంక్షేమ వసతి గృహాలవైపు కన్నెత్తి చూడని అధికారులు వసతి గృహాల్లో వేధిస్తున్న ఖాళీ పోస్టులు
జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ కళాశాల మైదానం ఆవరణలో ఉండే బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో సమస్యలు తాండవిస్తున్నాయి. 150కి పైగా బాలికలు ఉండే ఆ వసతి గృహానికి రెగ్యులర్ వార్డెన్ లేని దుస్థితి. దీంతో ప్రస్తుతం అక్కడున్న వార్డెన్ ఇంచార్జి కావడంతో విద్యార్థుల సమస్యలు అంతగా పట్టించుకోని పరిస్థితి. ఇంచార్జి వార్డెన్‌కు సమస్యలు చెప్పుకోవాలంటే విద్యార్థులు జంకుతున్నారు. ఇంకెవరైనా అధికారులు తనిఖీకి వస్తే చెప్పుకుందామనుకుంటే అధికారులు అటువైపు కన్నెత్తి చూడటమే లేదు. జిల్లా కేంద్రంలోని ముఖ్యమైన వసతి గృహంలోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఉండే వసతి గృహాల దయనీయ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, బీసీ వసతి గృహాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షించకపోవడం, ఇంచార్జి వార్డెన్లతో గాడి తప్పుతున్నాయి.
కార్వేటినగరం మండలం కత్తెరపల్లి బీసీ వసతిగృహానికి ఇన్‌చార్జులే దిక్కు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 బాల, బాలికల వసతి గృహాలున్నాయి. ఇందులో 3162 మంది బాల, బాలికలు ఉంటున్నారు. అదే విధంగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 25 ప్రీ మెట్రిక్ వసతి గృహాలుండగా అందులో 1022 మంది, 13 కళాశాల వసతి గృహాలుండగా అందులో 871 మంది విద్యార్థులుంటున్నారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ వసతి గృహాలకు పూర్తి స్థాయిలో వార్డెన్లు లేని దుస్థితి. దీంతో సగానికి పైగా హాస్టళ్లను ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. పూర్తి స్థాయిలో వార్డెన్లు లేకపోవడంతో హాస్టళ్ల పై సరైన పర్యవేక్షణ లేక విద్యార్థులు గాడి తప్పుతున్నారు. వారికి మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అస్తవ్యస్తంగా నిర్వహణ
పూర్తి స్థాయిలో వార్డెన్లు లేకపోవడంతో ఒక్కొక్క వార్డెన్ రెండు, మూడు హాస్టళ్ల బాధ్యతలు చూస్తున్నారు. వాస్తవానికి ప్రతి హాస్టల్‌లో వార్డెన్, డిప్యూటీ వార్డెన్, కుక్, సహాయకులు, నైట్ వాచ్‌మెన్ ఉండాలి. దగ్గరలో ఉండే పీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తుండాలి. కానీ, వార్డెన్లు అరకొరగా ఉండగా...మిగతా సిబ్బంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వార్డెన్లకు రెండు, మూడు హాస్టళ్ల బాధ్యతలను అప్పగించడంతో పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీంతో ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో మెనూ అమలు, నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో అడ్మిషన్లు సైతం నామమాత్రంగానే జరిగాయి.
ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం
ప్రస్తుతం జిల్లాలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో ఒక్కో వార్డెన్ కనీసం రెండు వసతి గృహాలైనా బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఒకదానిలో బాధ్యతలు చూడటమే కష్టంగా మారిన సందర్భంలో రెండు, మూడింటి పర్యవేక్షణ అప్పగించడంతో వారు దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. ఆ ప్రభావం వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థుల చదువులపై ప్రభావం చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల అభివృద్ధిని గాలికి వదిలేయడంతో పరిస్థితి దయనీయంగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడి చదువులు సవ్యంగా సాగని పరిస్థితి నెలకొంది. అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వార్డెన్లు రాత్రి సమయాల్లో ఏ వసతి గృహంలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
నిబంధనలు గాలికి వదిలేసి..
నిబంధనల ప్రకారం సమీపంలోని వసతి గృహ అధికారికే ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలి. లేదా సమీపంలోని ఎస్సీ వసతి గృహ అధికారికీ బాధ్యతలు ఇవ్వొచ్చు. ఎవరూ అందుబాటులో లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రాంతంలోని వారికి ఇంచార్జి బాధ్యతలను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో అలా జరగడం లేదు ఇష్టానుసారంగా ఎస్సీ, బీసీ సంక్షేమ వసతిగృహాలకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
సస్పెన్షన్‌కు గురై తిరిగి విధుల్లో చేరిన వారికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించకూడదు. అయితే కొందరికి నిబంధనలకు విరుద్ధంగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
వసతిగృహ అధికారులు రెగ్యులర్ గా పనిచేస్తున్న చోట ఉదయం, ఇంచార్జిగా వ్యవహరిస్తున్న హాస్టల్ లో సాయంత్రం సమయంలో ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఇవేమీ అమలు కావడం లేదు.
30 నుంచి 40 కి.మీ దూరంలోని వసతి గృహాలకు ఇంచార్జి బాధ్యతలను ఇవ్వడంతో పర్యవేక్షణ దారి తప్పింది. అంత దూరం ఇంచార్జి వార్డెన్లు వెళ్లలేక అక్కడ పనిచేసే సిబ్బందితోనే హాస్టళ్ల నిర్వహణ భారం మోపి చేతులు దులుపేసుకుంటున్నారు.
ఇష్టారాజ్యంగా సిబ్బంది వ్యవహారం
కూటమి ప్రభుత్వానికి పేద విద్యార్థులంటే అలుసెందుకు? పేద విద్యార్థులు విద్యనభ్యసించే సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేయకుండా అలసత్వం వహించడం దారుణం. జిల్లాలో చాలా వసతి గృహాలకు రెగ్యులర్ వార్డెన్లు లేకపోవడంతో సమస్యలు అధికంగా ఉన్నాయి. వార్డెన్లు లేని వసతి గృహాల్లో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సక్రమంగా మెనూ సైతం అమలు చేయకుండా అలసత్వం వహిస్తున్నారు.
– ప్రవీణ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి

వసతి పర్యవేక్షీణం

వసతి పర్యవేక్షీణం